సర్పంచ్ ముక్కులో విరిగిన స్వాబ్ స్టిక్.. తర్వాత అంత జరిగింది

Update: 2021-06-14 05:30 GMT
కొన్ని వార్తలు విపరీతంగా వైరల్ అవుతుంటాయి. హాట్ టాపిక్ గా మారతాయి. కానీ.. ఆ తర్వాత దాని గురించిన ఊసే ఉండదు. ఎందుకంటే.. ఎవరూ ఏమీ చెప్పరు. ఇప్పుడు చెప్పే ఉదంతం కూడా అలాంటి కోవకు చెందిందే. గడిచిన వారంలో కరీంనగర్ జిల్లాలోని ఒక గ్రామ సర్పంచ్ కు కరోనా నిర్దారణ పరీక్ష కోసం స్వాబ్ టెస్టు చేస్తున్న వేళ.. పుల్ల విరిగిన విషయం తెలిసిందే. ఈ వార్త పెద్దా.. చిన్నా అన్న తేడా లేకుండా అన్ని మీడియా సంస్థలతో పాటు.. వాట్సాప్.. సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యింది.

ముక్కులో పుల్ల విరిగిందన్న మాటే తప్పించి.. ఆ తర్వాత ఏం జరిగిందన్న అంశం మీద ఎవరూ ఫోకస్ పెట్టలేదు. వాస్తవానికి ఆ తర్వాతే చాలా జరిగిన విషయం తాజాగా బయటకురావటమే కాదు విస్మయానికి గురి చేసింది. కరోనా ఉందా? లేదా? అన్నది తేల్చటానికి ముక్కులోని రెండు రంధ్రాల్లో దూదితో ఉన్న స్వాబ్ స్టిక్ ను లోపలకు తీసుకెళ్లి అటు ఇటు తిప్పుతారు. దాన్ని తిప్పేటప్పుడు కళ్లలో నీళ్లు తిరగాల్సిందే. ఈ పరీక్ష చేసేటప్పుడు అప్రమత్తత చాలా అవసరం. పైపైన స్టిక్ కదిపి తీసేస్తే ఫలితం సరిగా రాదు. అదే సమయంలో మరింత లోపలకు తీసుకెళ్లినా ఇబ్బందే.

కరీంనగర్ జిల్లా వెంట్రావల్లి గ్రామంలో వైద్యులు కరోనా నిర్దారణ క్యాంప్ ను ప్రత్యేకంగా నిర్వహించారు. ఈ క్యాంప్ లో సర్పంచ్ జవ్వాజి శేఖర్ కు హెల్త్ సూపర్ వైజర్ కరోనా నిర్దారణ పరీక్ష చేస్తున్న వేళ.. స్వాబ్ స్టిక్ విరిగిపోయి ఇరుక్కుపోయింది. దీంతో ఒక్కసారి షాక్ తిన్న పరిస్థితి. ముక్కులో ఇరుక్కున్న పుల్లను బయటకు తీసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

దీంతో హుటాహుటిన సర్పంచ్ ను కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు సర్పంచ్ ను పరీక్షించి.. విరిగిన పుల్ల.. ముక్కులో నుంచి గొంతులోకి వెళ్లిందని గుర్తించారు. అనుభవం లేని సిబ్బంది కారణంగా ఇలాంటి పరిస్థితి చోటు చేసుకుందని తేల్చారు. అనంతరం.. ఎండోస్కోపి ద్వారా స్వాబ్ స్టిక్ ను.. దూదిని బయటకు తీశారు. ఈ ఉదంతంలోబాధితుడైన సర్పంచ్ మాట్లాడుతూ.. నాలుగు గంటల పాటు నరకయాతన చూసినట్లు చెప్పారు. అంతేకాదు.. సర్పంచ్ కి చోటు చేసుకున్న వైనంతో గ్రామస్తులు ఎవరూ పరీక్ష చేయించుకోవటానికి ముందుకు రాలేదు. చివరకు వారికి నచ్చజెప్పి ఎలాంటి ఆటంకం లేకుండా పరీక్షల్ని పూర్తి చేశారు. ముక్కులో విరిగిన పుల్ల తర్వాత అంత జరిగింది.
Tags:    

Similar News