బీఆర్ఎస్ తో తెలంగాణలో ఆంధ్రోళ్ల హవా షురూ?

Update: 2022-10-06 04:48 GMT
కొత్త సందేహాలకు తావిచ్చేలా మారింది భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రకటన. టీఆర్ఎస్ అధినేత.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న కేసీఆర్.. తన ప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీగా మారుస్తూ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. పార్టీ పేరుతో ప్రాంతీయం కాస్తా జాతీయం కావటం బాగానే ఉన్నా.. తెలంగాణలో మారే లెక్కల మీద అంచనాల ఇప్పుడు సరికొత్తగా వినిపిస్తున్నాయి.

తెలంగాణలో.. ముఖ్యంగా హైదరాబాద్ లో ఆంధ్రోళ్ల డామినేషన్ ఎక్కువైందని.. వారి పుణ్యమా అని.. తెలంగాణ సమాజం తీవ్రంగా నష్టపోతుందన్న వాదనను తీసుకొచ్చింది.. తెలంగాణ ప్రజలంతా ఆ వాదనను నమ్మేలా చెప్పటంలో సక్సెస్ అయ్యారు కేసీఆర్. ఆయన మాటల ప్రభావం ఎంతలా ఉంటుందన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

తాజాగా బీఆర్ఎస్ ప్రకటనతో కొత్త వాదన ఒకటి తెర మీదకు వచ్చింది. జాతీయ పార్టీ ప్రకటనలో భాగంగా అన్ని రాష్ట్రాల్లోనూ తన సత్తా చాటేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేయటం మామూలే. ఇలాంటి వేళలో సొంతోళ్ల కంటే కూడా మిగిలినవారికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన ఏపీలోని పలు ప్రాంతాల్లో సంబరాలు చోటు చేసుకున్నాయి.

ఇంతవరకు బాగానే ఉన్నా.. తన పార్టీని ఏపీలో వ్యాపించే ప్రయత్నంలో ఆ రాష్ట్రానికి చెందిన వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. అదే జరిగితే.. వారి చూపు హైదరాబాద్ మీద ఉంటుందనటాన్ని కాదనలేం.

హైదరాబాద్ లో చక్రం తిప్పటానికి.. తాము అనుకున్నది జరగటానికి వీలుగా బీఆర్ఎస్ లో చేరే ఆంధ్రోళ్ల కారణంగా తెలంగాణ వారికి నష్టం వాటిల్లటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.

ఏ ఆంధ్రోళ్ల బూచి చూపించి ప్రత్యేక తెలంగాణ అని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు అదే ఆంధ్రోళ్లకు సైతం ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. మరి.. అలాంటి వేళలో.. ఆంధ్రోళ్లకు పెరిగే ప్రాధాన్యం తెలంగాణ వారికి తగ్గించేలా చేస్తుందన్న ప్రశ్నకు ఆయనేం సమాధానం చెబుతారు? అన్నదే ఇప్పుడు అసలు సందేహం. మరి.. దీనికి కేసీఆర్ ఏమని బదులిస్తారు?


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News