ఈ ఏడాదిలో బీఆర్ఎస్ (టీఆర్ఎస్) ఆదాయం ఎంత పెరిగిందో తెలుసా?

Update: 2022-12-27 06:28 GMT
అధికారం ఉంటే ఇట్టే ఆదాయం వస్తుంది. అధికార పార్టీలకు దేశంలోని కార్పొరేట్లు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు విరాళాలు ఇచ్చేస్తుంటారు. వారి పార్టీ నడిపేందుకు ఇలా తమకు తోచిన సాయం కోట్లలో చేస్తుంటారు. ఆ విరాళాలతోనే ఆపార్టీలన్నీ నడిచేవి. ఇప్పుడు దేశంలో బీజేపీ సాలీనా 1000 కోట్లకు పైగా ఆదాయం వస్తోంది. ఇక బీజేపీ సంగతి పక్కనపెడితే తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కు ఏడాదిలో కళ్లు చెదిరే విరాళాలు అందాయి. అది తెలిస్తే అవాక్కావ్వాల్సిందే.

కాదేది సంపాదనకు అనర్హం అన్నట్టు అధికారంలో ఉన్న పార్టీల ఆదాయం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. దేశంలో బీజేపీకి, రాష్ట్రంలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్)కు అదే ఆర్జన వచ్చిపడుతోంది. భారత రాష్ట్రసమితిగా మారిన టీఆర్ఎస్ ఈ ఏడాదిలో ఆర్జించిన ఆదాయం చూస్తే కళ్లు బైర్లు కమ్మకమానవు. సహజంగానే అధికారంలో ఉన్న పార్టీలకు వారి అవసరార్థం.. కాంట్రాక్టులు, బిల్లులు, ప్రాజెక్టులు పట్టిన సంస్థలు భారీగానే విరాళాలు ఇస్తుంటాయి. అలానే అక్కడ బీజేపీకి, ఇక్కడ టీఆర్ఎస్ కు కూడా భారీగా ఆదాయం పెరగడం విశేషం.

కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన 2022 ఆడిట్ రిపోర్టు ప్రకారం.. పార్టీ ఆదాయం 2021-22 మధ్యకాలంలో రూ.37.65 కోట్ల నుంచి రూ.218.11 కోట్లకు చేరింది. ఈ ఏడాది ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రూ.153 కోట్లు, ట్రస్టుల ద్వారా రూ.40 కోట్ల ఆదాయం వచ్చినట్లు పార్టీ ఈ నివేదికలో వెల్లడించింది.  ఈ రెండు మార్గాల్లో గత ఏడాది ఎలాంటి ఆదాయం లేదు. ఇదే సమయంలో పార్టీ మొత్తం ఆస్తుల విలువ ఏడాదిలో రూ.288 కోట్ల నుంచి రూ.480 కోట్లకు చేరింది. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో 12 నెలలకు మించి కాలపరిమితితో కూడిన డిపాజిట్ల రూపంలో పార్టీ 2022 మార్చి 31 నాటికి రూ.451 కోట్లు దాచింది. గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఇలాంటి డిపాజిట్లు రూ.256 కోట్ల మేర ఉన్నాయి.

2021-22 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్) దాదాపు 218.11 కోట్ల రూపాయల విరాళాన్ని అందుకోగా, తెలుగుదేశం పార్టీకి (టిడిపి) 62.90 లక్షల రూపాయలు మాత్రమే విరాళం అందిందని రాజకీయ పార్టీల సహకార నివేదికలు వెల్లడించాయి. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ఆ పార్టీకి అత్యధిక విరాళాలు అందాయని టీఆర్‌ఎస్‌ సమర్పించిన నివేదికలో వెల్లడించింది. వ్యక్తులు లేదా కంపెనీలు లేదా సంస్థల నుండి రూ. 90 లక్షలు అందుకోగా, వివిధ ఎలక్టోరల్ ట్రస్టుల నుండి రూ. 40 కోట్లు అందుకుంది. అదేవిధంగా, 2021-22 సంవత్సరంలో టీఆర్‌ఎస్ ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రూ.1,53,00,00,000 పొందింది. మరోవైపు, 2021-22 సంవత్సరంలో 24 మంది వివిధ దాతల నుండి టీడీపీ రూ.62,90,120 పొందింది.

ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం, రాజకీయ పార్టీ కోశాధికారి లేదా దాని ద్వారా అధికారం పొందిన మరేదైనా వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో ఏదైనా వ్యక్తి లేదా ఇతర సంస్థల నుండి పార్టీకి స్వీకరించిన రూ. 20,000 కంటే ఎక్కువ విరాళం గురించి నివేదికను సిద్ధం చేస్తారు. వాటిని ప్రకటిస్తారు.

ఇలా ప్రస్తుతానికి విరాళాల్లో గులాబీ పార్టీ దూసుకుపోతోందని అర్థమవుతోంది. మరి ఈ ఊపు కంటిన్యూ అవుతుందా? అధికారం పోతే రూపాయి పుట్టదా? అన్నది వేచిచూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News