భారాసకు అసలుసిసలు బలం వీరు కదా? కేసీఆర్ గుర్తించాలి కదా?

Update: 2023-04-02 11:29 GMT
ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేయటం ఎవరైనా చేస్తారు. దాన్ని.. బలోపేతం చేయటం అంత తేలికైన విషయం కాదు. పార్టీని ఏర్పాటు చేసే వేళలో చెప్పే ఆదర్శాలకు తగ్గట్లుగా నేతలు నడుచుకోవటమే పార్టీ మూలాలు మరింత విస్తరించేలా చేస్తుంది. పేరున్న నేతలు.. పలుకుబడిన నేతలు ఎందరు ఉన్నప్పటికీ.. ఆదర్శాలు.. విలువలు ఉన్న నేతలు చాలా కొద్దిమందే ఉంటారు. ఇలాంటి వారు ఎంత ఎక్కువగా పార్టీలో ఉంటే.. సదరు రాజకీయ పార్టీ అంతలా విస్తరిస్తుంది. ఉద్యమ పార్టీగా ప్రస్థానం మొదలు పెట్టి.. అసలుసిసలు రాజకీయ పార్టీగా మారిన భారాసకు బలం ఏమిటంటే.. ఇప్పుడు చెబుతున్న వారే.

తోపు నేతలు ఎంతమంది ఉన్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో ఉండే విలువ కలిగిన నేతలు.. సదరు పార్టీ మీద మరింత మంచి అభిప్రాయాన్ని పెంచేలా చేస్తుంటాయి. మహబూబాబాద్ జిల్లా కురవి మండలాధ్యక్షురాలు పద్మావతి ఈ కోవకు చెందిన వారే. ఒక ప్రముఖ మీడియా సంస్థ కారణంగా.. ఆమెకు సంబంధించిన ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఆమె రాజకీయాల్లో ఉండటమే కాదు.. మండల అధ్యక్షురాలి బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. అయినప్పటికి.. జీవనాధారం కోసం ఆమె వ్యవసాయ కూలీగా పని చేస్తుంటారు.

రాజకీయాల్ని విలువలతో చేపట్టే ఇలాంటి వారి కారణంగా మరింత గౌరవం పెరగటమే కాదు.. పార్టీ ప్రతిష్ఠ కూడా మరింతగా విస్తరిస్తుంటుంది. అయితే.. వేదన కలిగించే విషయం ఏమంటే.. విలువలతో రాజకీయాలు చేయాలనుకునే వారు.. ఎంతటి ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొంటారు? వారి జీవనం ఎంత కష్టంగా ఉంటుందన్న దానికి నిదర్శనంగా పద్మావతి ఎపిసోడ్ కనిపిస్తుంటుంది.

కురవి మండలాధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న పద్మావతి.. తాను ఆ పదవిలో ఉండి కూడా పొలాల్లో రోజువారీగా వ్యవసాయ కూలీగా పని చేస్తుంటారు.  శనివారం విషయమే తీసుకుంటే ఆమె ఎమ్మెల్యే రెడ్యానాయక్ తో కలిసి ఐకేపీ మండల సమాఖ్య కార్యాలయ భవనం ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. మధ్యాహ్నం వేళ.. ఒక రైతు పొలంలో మిర్చితోటలో కూలి పని చేయటానికి వెళ్లారు. ఆమె భర్త గగులోతు రవి పార్టీలో క్రియాశీల కార్యకర్తగా పని చేస్తుంటారని స్థానికులు చెబుతారు. ఈ తరహా నేతల్ని గుర్తించి.. వారికి మరింత మెరుగైన వసతులుకల్పించటం ద్వారా పార్టీకి మరింత ప్రయోజనం చేకూరుతుందని చెప్పాలి. ఇలాంటి నేతల విషయంలో బీఆర్ఎస్ ముఖ్యనేతలు కేసీఆర్.. కేటీఆర్ లు గుర్తింపుతో పార్టీకి మేలు కలుగుతుందన్న విషయాన్ని మర్చిపోకూడదు.

Similar News