బీఎస్ ఎన్ ఎల్ నుంచి 80వేల మంది ఉద్యోగులు తీసివేత!

Update: 2019-09-07 05:52 GMT
కాలానికి తగ్గట్లుగా మారకపోవటానికి ఎంతటి ఖరీదైన మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుందో బీఎస్ ఎన్ ఎల్ సంస్థ జర్నీని చూస్తే అర్థమవుతుంది. కార్పొరేట్ దూకుడుకు ప్రభుత్వ రంగ సంస్థ బేలతనం తోడు కావటం.. కనిపించని రాజకీయ శక్తులు తెర వెనుక తీసుకునే నిర్ణయాలు.. బ్రహ్మాండంగా నడిచే సంస్థ స్థాయి నుంచి వేలాది మంది ఉద్యోగుల్ని తీసివేసే విషాద పరిస్థితి తాజాగా నెలకొంది.

దేశ ప్రజలకు టెలిఫోన్ సేవల్ని పరిచయం చేసిన ప్రభుత్వ రంగ సంస్థగా బీఎస్ ఎన్ ఎల్ ను కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం ఉండదు. ఒకప్పుడు తిరిగులేని అధిక్యతను ప్రదర్శించిన ఈ కంపెనీ.. తర్వాతి కాలంలో ప్రైవేటు టెలికాం కంపెనీలతో పోటీ పడలేక అంతకంతకూ తగ్గిపోయిన పరిస్థితి. అయితే.. ఈ సంస్థను స్వతంత్య్రంగా నిర్ణయాలు తీసుకుంటే ఇలాంటి పరిస్థితి ఉండేది కాదని.. రాజకీయ శక్తుల కారణంగానే ఇలాంటి దుస్థితి చోటు చేసుకుందన్న మాటను చెబుతారు.

ప్రైవేటు టెలికాం కంపెనీల దూకుడుకు తగ్గట్లు పోటీ పడే విషయంలో వెనుకబడిన బీఎస్ ఎన్ ఎల్ తాజాగా సంస్థకు భారంగా మారుతున్న ఉద్యోగుల్ని బయటకు పంపేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది. ఇందులో భాగంగా వీఆర్ ఎస్ పథకాన్ని తెర మీదకు తీసుకురావటం ద్వారా 70వేల నుంచి 80 వేల వరకూ ఉద్యోగుల్ని స్వచ్చందంగా వైదొలిగేలా ఒక ఆకర్షణీయమైన పథకాన్ని తీసుకురానున్నట్లుగా చెబుతున్నారు.

వినేందుకు వినసొంపుగా ఉన్నప్పటికీ.. తమ సంస్థ నుంచి 70 నుంచి 80వేల మంది ఉద్యోగుల్ని తొలగించేందుకు సిద్ధమైనట్లుగా చెప్పాలి. సంస్థ ఆదాయంలో ఉద్యోగుల జీతాలే 75 శాతం వరకూ ఉంటాయని.. వాటిని తగ్గించుకుంటే తప్పించి సంస్థ మళ్లీ కోలుకోదని చెబుతారు. మరింత భారీగా ఉద్యోగుల్ని తొలగిస్తే సంస్థ పని తీరు కుంటుపడే ప్రమాదం ఉండదా? అంటే.. అంతమందిని పంపిన తర్వాత కూడా దాదాపు లక్ష మందికి పైగా ఉద్యోగులు ఉంటారని చెబుతున్నారు.

ఒకవైపు ప్రైవేటుటెలికాంకంపెనీలన్నీ 4జీ.. 5జీ అంటూ దూసుకెళుతుంటే.. బీఎస్ ఎన్ ఎల్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందన్న విమర్శ ఉంది. ఉద్యోగులకు వీఆర్ఎస్ ఇవ్వాలన్న నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం.. అలక్ష్యమే కంపెనీ తాజా దుస్థితికి కారణంగా చెబుతున్నారు. బీఎస్ ఎన్ ఎల్ ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యల్ని అధిగమించేందుకు వీలుగా సంస్థ వద్ద ఉన్న భూముల్ని అమ్మాలన్న ఉద్దేశంలో ఉన్నట్లు చెబుతున్నారు. దీని ద్వారా రూ.20వేల కోట్ల నిధులు సమీకరించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఒకప్పుడు టెలికాంలో తిరుగులేని సంస్థగా ఉన్న బీఎస్ ఎన్ ఎల్ ఈ రోజు ఉద్యోగుల జీతాల గురించి కూడా ఆలోచించే పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనికి కారణం ఎవరన్నది బహిరంగ రహస్యం. రానున్న రోజుల్లో మరెంత గడ్డు పరిస్థితులను బీఎస్ఎన్ఎల్ ఎదుర్కొంటుందో చూడాలి. 
Tags:    

Similar News