వికాస్ దూబే ఎన్‌కౌంటర్ .. ప్రత్యక్ష సాక్షులు ఏంచెప్పారంటే ?

Update: 2020-07-10 12:11 GMT
ఉత్తర్ ‌ప్రదేశ్ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే పోలీసుల ఎన్‌ కౌంటర్‌ లో మృతి చెందిన సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్ ‌లోని ఉజ్జయిని లో అమ్మవారి ఆలయంలో గురువారం పోలీసులకి చిక్కిన వికాస్ దూబేను.. ఉత్తరప్రదేశ్ ‌కు తరలిస్తున్న సమయంలో పోలీసులు ఎన్ కౌంటర్ చేసి చంపేశారు. పట్టుబడ్డ దూబేను ఎస్టీఎఫ్ దళాలు యూపీలోని కాన్పూర్‌ కి తరలిస్తున్న సమయంలో మార్గమధ్యలో అతడిని తీసుకెళ్తోన్న కాన్వాయ్ బోల్తా పడిందని, దానితో అదే అదునుగా భావించిన దూబే తప్పించుకోవడానికి ప్రయత్నం చేయగా.. పోలీసులు కాల్చి చంపినట్టు పోలీస్ వర్గాలు చెప్తున్నాయి. అయితే , ప్రస్తుతం దూబే ఎన్ కౌంటర్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ఎన్‌ కౌంటర్‌ పై వివరణ ఇవ్వాలని విపక్షాలు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని, పోలీసులను డిమాండ్ చేస్తున్నాయి. దూబే ఎన్ ‌కౌంటర్ ‌పై తాజాగా పలువురు ప్రత్యక్ష సాక్షులు కూడా స్పందించారు. రోజులాగానే మా ఇంటికి వెళ్తున్న సమయంలో మాకు కొంచెం దూరంలోని సచెండీ ప్రాంతంలో తుపాకీ పేలిన శబ్దం వచ్చింది అని , దానితో ఏంటో అని మేము అక్కడికి చూడటానికి వెళ్లగా మమ్మల్ని అక్కడి పోలీసులు సంఘటన స్థలానికి పోనివ్వలేదు అని తెలిపారు. అలాగే , ఆ ఘటన జరిగిన తరువాత అక్కడికి అంబులెన్స్ ఎలా వచ్చింది అని అడగ్గా ..అంబులెన్స్ రాలేదు అని ,అందరినీ సొంత వాహనంలోనే అక్కడినుంచి తరలించారని మరో వ్యక్తి చెప్పారు. ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతానికి చాలామంది వస్తుండటంతో అక్కడ భారీగా పోలీస్ బలగాలు మోహరించాయి.

అయితే . దూబే ఎన్ కౌంటర్ పై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఎంతోమంది రాజకీయ నాయకులు, పోలీసులతో సంబంధాలు ఉన్న దూబేని హత్య చేయడం ద్వారా...వారందరినీ కాపాడేందుకు ప్రయత్నించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దూబేని చట్టప్రకారం విచారించి ఉంటే వాళ్లందరి వ్యవహారం బండారం బయటపడేదని అంటున్నారు. ఎన్‌ కౌంటర్ ‌పై సుప్రీంకోర్టుతో విచారణ జరిపించాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు.

Tags:    

Similar News