అమీర్ పేట మెట్రో స్టేషన్ పై నుంచి దూకేసిన బీటెక్ విద్యార్థిని!

Update: 2021-11-13 04:14 GMT
ఏమైందో తెలీదు? ఎందుకలా చేసిందో కూడా అర్థం కావట్లేదు? ఎలాంటి సమస్యల్ని లోలోన ఎదుర్కొంటుందో తెలీదు కానీ.. తాజాగా ఆమె చేసిన పని ఇప్పుడు సంచలనంగా మారింది. హైదరాబాద్ మహానగరంలోని అమీర్ పేట మెట్రో రైల్వే స్టేషన్ రెండో అంతస్తు నుంచి కిందకు దూకేసి ఆత్మహత్యాయత్నం చేసిన బీటెక్ విద్యార్థిని ఉదంతం ఇప్పుడు షాకింగ్ గా మారింది. శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల వేళలో చోటు చేసుకున్న ఈ ఉదంతానికి కారణాలు ఏమిటన్నది ఇంకా తెలియరాలేదు.

చూసినంతనే ఎగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఆమెను టోలిచౌకిలో ఉండే యాకుబ్ పాషా కుమార్తె హీనాగా గుర్తించారు. హాస్టల్ లో ఉంటూ బీటెక్ చదువుతున్న ఆమె.. ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అన్నదిప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.

మెట్రో స్టేషన్ రెండో అంతస్తు నుంచి కిందకు దూకేసిన కారణంగా ఆమె నోరు.. ముక్కు నుంచి అధిక రక్తస్రావమైంది. ప్రస్తుతం అపస్మారక స్థితిలో ఆమె కండీషన్ ఉంది. తీవ్రంగా గాయపడిన ఆమెను ప్రైవేటు ఆసుపత్రికి తరలించి.. వైద్యం చేయిస్తున్నారు. గాయాల తీవ్రత ఎక్కువగా ఉన్నా.. ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. ఆత్మహత్యలు చేసుకోవటానికి వీలుగా మెట్రో స్టేషన్లు మారుతున్నాయన్న మాట ఈ మధ్యన చోటు చేసుకున్న ఉదంతాల్ని చూస్తే అర్థం కాక మానదు. ఇటీవల కాలంలో నలుగురు మెట్రో స్టేషన్ మీద నుంచి దూకి ప్రాణాలు తీసుకుంటున్న ఉదంతాలు చోటు చేసుకున్నాయి. రెండేళ్లక్రితం ఒక యువతి.. గత ఏడాది మరో ముగ్గురు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇంతకీ ఆమె ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందన్న విషయం.. ఆమె స్ప్రహలోకి వస్తే కానీ వివరాలు తెలీవని చెబుతున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.




Tags:    

Similar News