చేతులెత్తేసిన మరో టీడీపీ అభ్యర్థి!

Update: 2019-03-18 17:16 GMT
అదేంటో.. చంద్రబాబు నాయుడు టికెట్లు ఖరారు చేశాకా కూడా నేతలు చేతులు ఎత్తేస్తున్న దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే నెల్లూరు రూరల్ అభ్యర్థిగా ఖరారు అయిన ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశాన్ని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోయారు. ఆదాలకు బాబు కోరిన సీటు ఇవ్వడానికి రెడీ అని అప్పట్లోనే ఆఫర్ ఇచ్చారు. నెల్లూరు ఎంపీ సీటు అయినా - నెల్లూరు రూరల్ సీటు అయినా ఆదాల కోరిక మేరకే బాబు కేటాయించారు. అయితే బాబుకు ఝలక్ ఇస్తూ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోయారు ఆదాల.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఆయన నెల్లూరు ఎంపీగా పోటీ చేయడం ఖరారు అయ్యింది. ఇప్పటికే పని మొదలుపెట్టేశారు కూడా. ఆ సంగతలా ఉంటే..తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తొలి జాబితాలో టికెట్ ఖరారు చేసిన మరో నేత తప్పుకున్నట్టుగా ప్రకటించారు. ఆయనే బుడ్డా రాజశేఖర రెడ్డి. ఈయన గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు. శ్రీశైలం నుంచి విజయం సాధించారు. అయితే ఆ తర్వాత ఫిరాయించారు. అధికారం ఉందని తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో.. ఈయనకు చంద్రబాబు నాయుడు శ్రీశైలం టికెట్ ను ఖరారు చేశారు. ఈ మేరకు తొలి జాబితాలో ఈయన పేరును ప్రకటించారుకూడా.అయితే ఏమైందో ఏమో కానీ..తను పోటీలో ఉండటం లేదని బుడ్డా రాజశేఖర రెడ్డి స్పష్టం చేశారు.

తన స్థానంలో తన సోదరుడు బుడ్డా శేషా రెడ్డికి టికెట్ ఇవ్వాలని రాజశేఖర రెడ్డి కోరుతున్నారట. శేషారెడ్డి ప్రస్తుతానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. తన భార్యకు ఆరోగ్యం బాగోలేదని అందుకే తను పోటీ నుంచి తప్పుకుంటున్నట్టుగా బుడ్డా రాజశేఖర రెడ్డి చెబుతున్నారు. అయితే ఈయన ఓటమి భయంతో తప్పుకుంటున్నాడని టాక్!

బుడ్డా ఇచ్చిన ఝలక్ తో తెలుగుదేశం కార్యకర్తలు నివ్వెర పోతున్నారు. ఈయనపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు శ్రీశైలానికి మళ్లీ అభ్యర్థిని వెదకాల్సిన పరిస్థితుల్లోకి వెళ్లిపోయాడు చంద్రబాబు నాయుడు. చివరకు ఈ నియోజకవర్గంతో పెద్దగా సంబంధం లేదని.. ఏవీ సుబ్బారెడ్డిని ఇక్కడ నుంచి పోటీ చేయించే ఆలోచనలో ఉన్నారట! మొత్తానికి చంద్రబాబు నాయుడు అభ్యర్థిత్వాలు ఖరారు చేసినా.. నేతలు ఇలా ఆయనకు షాక్ లు ఇస్తూ ఉండటం ఈ ఎన్నికల ప్రక్రియలో ఆసక్తిదాయకంగా నిలుస్తున్న అంశం అవుతోంది!
Tags:    

Similar News