తూచ్.. శ్రీశైలం నుంచి పోటీలో ఉన్నట్టేనట!

Update: 2019-03-20 04:09 GMT
తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్లో ఎంత గందరగోళం నెలకొందో వాళ్లే స్పష్టత ఇస్తున్నారు. టికెట్ దక్కిన వారు కూడా పోటీలో ఉన్నట్టా.. లేనట్టా.. అనే సందేహాలు నెలకొంటున్న పరిస్థితులను కల్పిస్తున్నారు తెలుగుదేశం నేతలు. అందులో భాగంగా వివిధ నియోజకవర్గాల్లో రచ్చలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ పరంపరలో నిలిచిన నియోజకవర్గం శ్రీశైలం.

ఇక్కడ నుంచి టికెట్ ఖరారు చేసుకున్న బుడ్డా రాజశేఖర రెడ్డి తను పోటీకి దూరంగా ఉంటున్నట్టుగా ప్రకటించి ఆశ్చర్యపరిచారు. తను వ్యక్తిగత కారణాలతో తప్పుకుంటున్నట్టుగా ఆయన ప్రకటించుకున్నారు. చేతులు ఎత్తేసినట్టే అని వార్తలు వచ్చాయి. శ్రీశైలం నియోజకవర్గం విషయంలో చంద్రబాబు నాయుడు ప్రత్యామ్నాయం రెడీ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినట్టుగా వార్తలు వచ్చాయి.

అందులో భాగంగా వివిధ పేర్లను బాబు పరిశీలిస్తున్నట్టుగా - శ్రీశైలం నుంచి పోటీ చేయించడానికే బైరెడ్డి రాజశేఖర రెడ్డిని కూడా బాబు చేర్చుకుంటున్నట్టుగా ప్రచారం జరిగింది. చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా ప్రచారానికి వెళ్లాక కథ కాస్త మారినట్టుగా ఉంది. పోటీలో ఉండమని బుడ్డాను చంద్రబాబు నాయుడు బుజ్జగించినట్టుగా తెలుస్తోంది. దీంతో తను పోటీలో ఉండటానికి బుడ్డా ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది.

నిన్నంతా ఏవేవో చెప్పి తను పోటీలో ఉండనట్టుగా ప్రకటించుకున్న బుడ్డా ఇప్పుడు మళ్లీ తను పోటీలో ఉన్నట్టేనని అంటున్నారట. ఇలాంటి మాటలు.. వీరి విషయంలో ప్రజలకు ఎలాంటి అభిప్రాయాలు కలిగిస్తాయో చెప్పనక్కర్లేదు.

అసలే బుడ్డా రాజశేఖర రెడ్డి ఫిరాయింపు నేత. గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున నెగ్గి - ఇప్పుడు తెలుగుదేశం నేతగా చలామణి అవుతున్నారు. కనీసం ఇక్కడైనా సరిగా ఉండకుండా..ఈయన వ్యవహరిస్తున్న తీరు.. ఈ నియోజకవర్గంలో టీడీపీ చిత్తుగా ఓడటం ఖాయమనే అభిప్రాయాలను కలిగిస్తోందని పరిశీలకులు  వ్యాఖ్యానిస్తున్నారు!
Tags:    

Similar News