త‌మ్ముళ్లు నోరు జారుతుంటే బాబుకు ప‌ట్ట‌దా?

Update: 2017-08-08 16:37 GMT
విమ‌ర్శ అన్న‌ది హుందాగా ఉండాలి. ఎంత దూకుడు రాజ‌కీయాలు అయితే మాత్రం.. ఇష్టారాజ్యంగా మాట్లాడ‌టాన్ని ఎవ‌రూ ఒప్పుకోరు. ప్ర‌జాస్వామ్యంలో అధికార‌ప‌క్షం ఎంత ఒదిగి ఉంటే అంత హుందాగా ఉంటుంది. ప్ర‌తిప‌క్షం అన్న‌ది ప్ర‌జ‌ల ప‌క్షం కావ‌టం.. అధికారానికి దూరంగా ఉన్న నేప‌థ్యంలో వారి వ్యాఖ్య‌ల్లో తీవ్ర‌త క‌నిపించ‌టం మామూలే. అది త‌ప్పేం కాదు కూడా. అయితే.. విప‌క్షం చేసే విమ‌ర్శ‌ల్ని స‌మ‌ర్థంగా ఎదుర్కోవాలి.. తాము చేసిన అభివృద్ధి కార్య‌క్ర‌మాల్ని ప్ర‌జ‌ల‌కు చెప్పుకోవాలే కానీ.. అడ్డ‌గోలు వ్యాఖ్య‌లు ఎంత మాత్రం మంచిది కాదు.

శ్రుతి మించి రాగాన ప‌డుతున్న చందంగా మ‌హిళా నేత అన్న‌ది చూడ‌కుండా అభ్యంత‌ర‌క‌ర భాష‌లో తిట్టేయ‌టం ఏ మాత్రం మంచిది కాదు. ఏపీలో సాగుతున్న తాజా రాజ‌కీయం రోజురోజుకి దారుణంగా మారుతోంది. నంద్యాల ఉప ఎన్నిక అధికార‌.. విపక్షాల‌కు ప్ర‌తిష్ఠాత్మ‌కం కావ‌టంతో త‌మ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌పై విమ‌ర్శ‌ల దాడిని అంత‌కంత‌కూ పెంచుతున్నారు.

ఈ నేప‌థ్యంలో అధికార‌ప‌క్ష ఎమ్మెల్యే బుద్దా వెంక‌న్న చేసిన వ్యాఖ్య‌లు షాకింగ్ గా మారాయి. విప‌క్ష నేత ఆర్కే రోజాపై ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు అభ్యంత‌ర‌క‌రంగా ఉండ‌ట‌మే కాదు.. మ‌రీ ఇంత దిగ‌జారి వ్యాఖ్య‌లు చేస్తారా? అన్న ప్ర‌శ్న ప‌లువురి నోట వినిపిస్తోంది. ఇటీవ‌ల కాలంలో రోజా.. ఏపీ మంత్రి అఖిల‌ప్రియ మ‌ధ్య మాటల యుద్ధం జ‌ర‌గ‌టం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా హాట్ హాట్ వ్యాఖ్య‌లు చేసుకున్నారు.

ఒక మ‌హిళా నేత మీద మ‌రో మ‌హిళా నేత మాటా మాటా అనుకోవ‌టం ఒక ప‌ద్ధ‌తి.కానీ.. అందుకు భిన్నంగా ఒక మ‌హిళా నేత‌పై తెలుగు త‌మ్ముడు చేసిన దారుణ వ్యాఖ్య‌లు ఏ మాత్రం స‌రికాద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ప్ర‌తిప‌క్ష పార్టీ ఒక డ్రామా కంపెనీగా మారింద‌న్న వెంక‌న్న‌.. వైఎస్సార్ కాంగ్రెస్ డ్రామా కంపెనీలో రోజాది చింతామ‌ణి క్యారెక్ట‌ర్ అంటూ ల‌క్ష్మ‌ణ‌గీత‌ను దాటేశారు.

అఖిల ప్రియ‌ను విమ‌ర్శిస్తారా? అంటూ.. రోజా స‌భ‌ల్లో పాల్గొనేట‌ప్పుడు ఆల్క‌హాల్ టెస్ట్ జ‌రిపించాలంటూ బుద్దా వెంక‌న్న చేసిన వ్యాఖ్య‌లు పెను దుమారాన్ని రేపుతున్నాయి. మ‌హిళ‌ల హుందాత‌నాన్ని దెబ్బ తీసేలా.. వారి వ్య‌క్తిత్వంపై దారుణ వ్యాఖ్య‌లు చేస్తున్న త‌మ్ముళ్ల నోటికి బాబు ఎందుకు తాళాలు వేయ‌టం లేద‌న్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. నిత్యం విలువ‌ల గురించి సూక్తిముక్తావ‌ళి వ‌ల్లించే చంద్ర‌బాబు లాంటి వారు.. త‌మ్ముళ్లు చేస్తున్న దారుణ వ్యాఖ్య‌ల మీద స్పందిస్తే బాగుంటుంద‌న్న వాద‌న వినిపిస్తోంది.
Tags:    

Similar News