గుడివాడలో కేసినో ఉందా.. లేదా పుష్ప?: టీడీపీ నేత సెటైరికల్‌ ట్వీట్‌ వైరల్‌!

Update: 2023-01-10 11:06 GMT
గత ఏడాది సంక్రాంతికి కృష్ణా జిల్లాలోని గుడివాడ హాట్‌ టాపిక్‌ గా మారింది. గుడివాడలో పెద్ద ఎత్తున గుండాట, కోత ముక్క, కోడి పందేలు నడిచాయని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. గోవా తరహాలో కేసినోలు నిర్వహించారని.. రాత్రింబవళ్లు నిర్వహించిన కేసినోలతో రూ.500 కోట్ల రూపాయలకు పైగా కొడాలి నాని ఆర్జించారని తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

కేసినోలకు కోసం గోవా వెళ్లాల్సిన పనిలేదని.. గుడివాడ వెల్తే చాలని టీడీపీ నేతలు ఎద్దేవా చేశారు. కొడాలి నాని ప్రధాన అనుచరుడే కేసినోలు నిర్వహించారని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. ఒక వర్గం మీడియాలోనూ గుడివాడలో సంక్రాంతి సంబరాల ముసుగులో కేసినోలు నిర్వహించారని పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. టీడీపీ నిజనిర్ధారణ కమిటీ పేరుతో ఒక బృందాన్ని కూడా గుడివాడ పంపింది.

ఈ నేపథ్యంలో గుడివాడ కేసినో వ్యవహారాన్ని మరోమారు టీడీపీ నేతలు టార్గెట్‌ చేస్తున్నారు. విజయవాడ టీడీపీలో ముఖ్య నేతగా ఉన్న బుద్ధా వెంకన్న ఈ మేరకు సెటైరికల్‌ ట్వీట్‌ చేశారు. ఈ ఏడాది సంక్రాంతికి గుడివాడలో కేసినో లేదా గడ్డం పుష్ప అంటూ సెటైర్‌ వేశారు.

ప్రముఖ నటుడు అల్లు అర్జున్‌ హీరోగా వచ్చిన పుష్ప సినిమాలో ఎస్పీ భన్వర్‌ సింగ్‌ షెకావత్‌.. హీరో పాత్రధారి అయిన అల్లు అర్జున్‌ ను పార్టీ లేదా పుష్ప అంటూ అడుగుతాడు. ఇప్పుడు ఇదే డైలాగ్‌ ను సెటైర్‌ గా మార్చి ఈ ఏడాది సంక్రాంతికి గుడివాడలో కేసీనో లేదా గడ్డం పుష్ప అంటూ ప్రశ్నించారు.

గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిని గడ్డం గ్యాంగ్‌ అని టీడీపీ నేతలు పిలుస్తున్న సంగతి తెలిసిందే. కొడాలి నాని నిత్యం ఎప్పుడూ గడ్డంతో కనిపిస్తూ ఉంటారనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గుడివాడలో ఈ ఏడాది కేసినో లేదా గడ్డం పుష్ప అంటూ బుద్ధా వెంకన్న,, కొడాలి నానిపైన సెటైర్‌ వేశారు. ఈ ట్వీట్‌ కు గడ్డంగ్యాంగ్‌కేసినో అనే హ్యాష్‌ట్యాగ్‌ ను ఆయన జత చేశారు.

ఈ ట్వీట్‌ ఇప్పుడు వైరల్‌ గా మారింది. ఈ ట్వీట్‌ ను టీడీపీ కార్యకర్తలు వైరల్‌ చేస్తున్నారు. మరోవైపు వైసీపీ నేతలు ఈ ట్వీట్‌ పై మండిపడుతున్నారు. కెలికి మరీ తన్నించుకోవడమో అంటే ఇదేనేమో అని బుద్ధా వెంకన్నను ఎద్దేవా చేస్తున్నారు. కేసినో ఉంది.. వచ్చి డ్యాన్స్‌ వేస్తావా అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.

బుధ్దా వెంకన్న ట్వీట్‌ పై ఇంకా కొడాలి నాని స్పందించలేదు. అలాగే ఆయన అనుచరులు సైతం రిప్లై ఇవ్వలేదు. గతంలో కేసినో నిర్వహించానంటూ తనపై వచ్చిన వార్తలను కొడాలి నాని తీవ్రంగా ఖండించారు. అయితే టీడీపీ నేతలు మాత్రం ఇంకా కేసినోలు వ్యవహారాన్ని మర్చిపోనట్టే ఉన్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News