తుపాకీలు కూడా కొన‌లేని దైన్య‌మా మోడీ?

Update: 2018-06-05 04:46 GMT
అవున‌న్నా.. కాద‌న్నా.. జ‌నం ముక్కుపిండి మ‌రీ వ‌సూలు చేయ‌టంలో మోడీ స‌ర్కారు గొప్ప‌ద‌నం దేశ ప్ర‌జ‌ల‌కు బాగానే అర్థ‌మైంది. ఆయ‌న నాలుగేళ్ల పాల‌న‌లో స‌గ‌టుజీవి మీద ప‌డిన ప‌న్నుల భారం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఆదాయం భారీగా పెరుగుతున్నా.. ర‌క్ష‌ణ‌కు సంబంధించి కీల‌క విష‌యాల్లో ఇప్ప‌టికి నిధుల లేమి వెంటాడ‌టం ఆశ్చ‌ర్యానికి గురి చేయ‌క మాన‌దు.

కాంగ్రెస్ పాల‌న‌పై అదే ప‌నిగా తీవ్ర విమ‌ర్శ‌లు చేసి.. అధికారంలోకి వ‌చ్చిన మోడీ త‌న నాలుగేళ్ల పాల‌న త‌ర్వాత కూడా సైనికుడికి క‌నీస ఆయుధ‌మైన రైఫిల్ కొనేందుకు సైతం నిధుల లేమి వెంటాడ‌టం.. కొనాల్సిన వాటిల్లో కేవ‌లం మూడో వంతును మాత్ర‌మే కొన‌టం ఇప్పుడు షాకింగ్ గా మారింది.

ఆధునిక రైఫిళ్ల కోసం పెడుతున్న ఆర్డ‌ర్‌ను భారీగా కుదించారు. కేవ‌లం 2.5ల‌క్ష‌ల రైఫిళ్ల‌ను మాత్ర‌మే కొనుగోలు చేయాల‌ని నిర్ణ‌యించారు. ఇవి అవ‌స‌ర‌మైన తుపాకీల‌తో పోలిస్తే కేవ‌లం మూడో వంతు మాత్ర‌మే కావ‌టం గ‌మ‌నార్హం. స‌రిహ‌ద్దుల్లో పెరుగుతున్న అశాంతి నేప‌థ్యంలో అత్యాధునిక ఆయుధాల అవ‌స‌రం ఉంది.

అయితే.. ఇందుకు అవ‌స‌ర‌మైన నిధుల విష‌యంలో ఉన్న ఇబ్బందుల కార‌ణంగా క‌నీస ఆయుధాల కొనుగోలు విష‌యంలోనూ కోత‌లు విధిస్తున్నారు. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో స‌రిహ‌ద్దు ప్రాంతాలైన క‌శ్మీర్‌.. నియంత్ర‌ణ రేఖ‌.. ఈశాన్య రాష్ట్రాల్లోని స‌రిహ‌ద్దుల్లో అత్యాధునిక ఆయుధాల్ని చేప‌ట్టాల్సిన త‌క్ష‌ణ అవ‌స‌రం సైన్యానికి ఉంది.

అయితే.. నిధుల కొర‌త‌తో పాటు.. అధికారుల అల‌స‌త్వం కూడా ముఖ్య‌మైన ఆయుధాల కొనుగోలును వాయిదా వేసేలా చేస్తోంది. తాజాగా పెరుగుతున్న శ‌త్రు దాడుల నేప‌థ్యంలో అత్యాధునిక తుపాకీలు కొనాల‌ని నిర్ణ‌యించారు. అయితే.. బ‌డ్జెట్ కొర‌త కార‌ణంగా అవ‌స‌ర‌మైన ఆయుధాల‌కు భిన్నంగా రెండున్న ల‌క్ష‌ల రైఫిళ్ల‌ను మాత్ర‌మే కొనుగోలు చేయాల‌ని నిర్ణ‌యించారు.

ఇందులో భాగంగా సైనిక బృందాలు ఇట‌లీ.. స్విట్జ‌ర్లాండ్‌.. చెక్ రిప‌బ్లిక్ .. ఇజ్రాయెల్‌ కు వెళ్లి అక్క‌డి ఆయుధ కంపెనీల‌తో స‌మావేశం కానున్నాయి. అనంత‌రం ఆర్డ‌ర్లు పెట్ట‌నున్నారు. చూస్తుంటే.. ఆయా దేశాల‌కు తిరిగి వ‌చ్చి.. ఏ తుపాకీలు కొనాల‌న్న నిర్ణ‌యం తీసుకోవ‌టానికి ఖ‌ర్చు ఓ రేంజ్లో ఉంటుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. దేశం దూసుకెళ్లిపోతుంద‌ని అదే ప‌నిగా గొప్పులు చెప్పే ప్ర‌ధాని.. సైనికుల‌కు అవ‌స‌ర‌మైన స్థాయిలో అత్యాధునిక‌  తుపాకీలు కొన‌లేని వైనంపై మ‌న్ కీ బాత్‌ లోనో.. మ‌రే బాత్ లో అయినా ప్ర‌స్తావించి.. వివ‌ర‌ణ ఇస్తే బాగుంటుంది.
Tags:    

Similar News