కేంద్ర బ‌డ్జెట్‌!..ఇంట‌ర్నెట్‌ కే అత్య‌ధిక ప్రాధాన్యం!

Update: 2018-02-01 10:05 GMT
2018-19 ఏడాదికి సంబంధించి కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన తాజా బ‌డ్జెట్‌ లో ఏ అంశాని అత్యంత ప్రాధాన్యం ల‌భించింది. ఏ అంశాన్ని ప్ర‌భుత్వం ప‌ట్టించుకోలేదు. అన్న విష‌యాలు ఇంకొన్ని గంట‌లు గ‌డిస్తే త‌ప్పించి ప‌క్కా లెక్క‌లు తేలేలా లేవు. రైతులు - గ్రామ సీమ‌ల అభివృద్ధికి పెద్ద పీట వేసిన‌ట్లుగా క‌నిపిస్తున్న అరుణ్ జైట్లీ బ‌డ్జెట్ ప్ర‌సంగంలో ఎంత‌మాత్రం అనుమానం లేద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప్ర‌సంగం తేల్చేసింది. జైట్లీ బ‌డ్జెట్ ప్రసంగం ముగిసిన కాసేప‌టికే మీడియా ముందుకు వ‌చ్చిన ప్ర‌ధాని ఇదే అంశాన్ని ప్ర‌స్తావించారు. తాజా బ‌డ్జెట్‌ లో గ్రామ సీమ‌ల అభివృద్దికి పెద్ద పీట వేశామ‌ని - అదే స‌మ‌యంలో దేశానికి అన్నం పెడుతున్న అన్న‌దాత‌ల సంక్షేమానికి - మొత్తంగా సాగుకు మ‌రింత పెద్ద పీట వేశామ‌ని చెప్పిన మోదీ... ఇంకొన్ని అంశాల‌ను ప్ర‌స్తావించారు.

ల‌ఘు - చిన్న‌ - మ‌ధ్య‌త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాట్లు - అందుకు గానూ ఔత్సాహిక పారిశ్రామిక‌వేత్త‌ల‌కు అన్ని ర‌కాలుగా ప్రోత్సాహం అందించేందుకు ఏకంగా రూ.3 ల‌క్ష‌ల కోట్ల మేర రుణాల‌ను అందజేయ‌నున్న విష‌యాన్ని ఆయ‌న ప్ర‌స్తావించారు. అయితే జైట్లీ లోక్ స‌భ‌లో చేసిన బ‌డ్జెట్ ప్ర‌సంగంలో చాలా మంది ఓ చిన్న అంశాన్ని విని నిజంగానే అమితాశ్చ‌ర్యానికి గురి అయ్యార‌నే చెప్పాలి. అదే దేశ‌వ్యాప్తంగా ఇంట‌ర్నెట్ స‌దుపాయాన్ని క‌ల్పించేందుకు వైఫై హాట్ స్పాట్ల‌ను ఏర్పాటు చేస్తామ‌ని చెప్పిన అంశ‌మే. ఇందుకోసం రూ.10 వేల కోట్ల మేర నిధుల‌ను కేటాయిస్తున్న‌ట్లుగా జైట్లీ ప్ర‌క‌టించారు. ఈ అంశానికి సంబంధించి జైట్లీ ఏం చెప్పార‌న్న విష‌యానికి వ‌స్తే... భార‌త్ నెట్ వ‌ర్క్ ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టి గ్రామాల‌ను డిజిట‌లైజ్ చేయ‌నున్నారు. దీనికోసం ప‌ది వేల కోట్ల రూపాయ‌లు కేటాయించారు. ప్ర‌తి గ్రామానికి ఇంట‌ర్నెట్ స‌దుపాయం క‌ల్పించ‌డానికి ప్ర‌త్యేక నిధులు కేటాయించారు. టోల్ ప్లాజాలో వాహ‌నాలు ఇక ప్ర‌తి చోటా ఆగ‌కుండా ఎలక్ట్రానిక్ పే సిస్ట‌మ్ మొద‌లుపెట్ట‌నున్నారు.

ఫ‌లితంగా ఊర్లో ఉన్నా, టౌన్లో ఉన్నా... రైల్లో ఉన్నా వైఫై ఉంటుంది. ఇంట‌ర్నెట్ స‌దుపాయ క‌ల్ప‌న‌కు-టెక్నాల‌జీకి ఈ బ‌డ్జెట్ లో మంచి ప్రాధాన్యం ఇచ్చారు. అన్ని రైల్వే జోన్లతో పాటు ప్ర‌తి రైల్లో వైఫై స‌దుపాయం క‌ల్పించ‌నున్నారు. అంతేకాదు, ప్ర‌తి రైల్లో సీసీ టీవీలు ఏర్పాటుచేసి నేరాల‌ను - దొంగ‌త‌నాలు - స్ర్తీల‌పై అఘాయిత్యాల‌ను నివారించ‌డానికి చ‌ర్య‌లు తీసుకోనున్నారు. మొత్తంగా జైట్లీ ప్ర‌వేశ‌పెట్టిన ఈ బ‌డ్జెట్లో గ్రామాల‌కు ఇంట‌ర్నెట్ స‌దుపాయాన్ని క‌ల్పించేందుకు ఉద్దేశించిన ఈ కేటాయింపే హైలెట్ అని చెప్పాలి.

Tags:    

Similar News