గూబ గుయ్యిమనేలా బుల్లెట్ ట్రైన్ టికెట్ ధర

Update: 2016-05-05 05:52 GMT
బుల్లెట్ ట్రైన్ అంటూ మోడీ సర్కారు ఉదరగొట్టటం.. ఆ మాటల్ని.. బుల్లెట్ ట్రైన్ విశేషాలు విన్న తర్వాత.. గంటల కొద్దీ ప్రయాణాల్ని తగ్గించే బుల్లెట్ ట్రైన్ లు దేశంలోకి వస్తే బాగుండని ఫీలైన వారు ఎంతోమంది ఉన్నారు. ఇలాంటి ఆశాజీవుల్లో మరింత ఉత్సాహపరిచేలా మోడీ సర్కారు బుల్లెట్ ట్రైన్ ఏర్పాటు విషయంలో చకచకా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. బుల్లెట్ ట్రైన్ ఏర్పాటుకు దేశం ఇంకా సిద్ధంగా లేదన్న విషయం బుల్లెట్ ట్రైన్ టిక్కెట్టు ధర గురించి అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత అందరి నోట వినిపిస్తున్న పరిస్థితి.

భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టి నిర్మించే బుల్లెట్ ట్రైన్ టిక్కెట్టు ధర విమాన టిక్కెట్టుకు మించి ఉండటం మింగుడుపడని రీతిగా ఉంది. పార్లముంట్ లో ఎంపీ ఒకరు అడిగిన ప్రశ్నకు సమాదానం ఇచ్చిన రైల్వే మంత్రిత్వ శాఖ.. భవిష్యత్తులో తాము ప్రారంభించే ముంబయి – అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్ టిక్కెట్ ధరలు ఎలా ఉంటాయో వెల్లడించారు. ఈ రెండు నగరాల మధ్య దూరం 508 కిలోమీటర్లు కాగా.. బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ క్లాస్ టిక్కెట్టు ధర రూ.3300గా నిర్ణయించినట్లుగా పేర్కొన్నారు.

ఇప్పుడు ఇదే రూట్లో ప్రయాణించే ఎక్స్ ప్రెస్ ట్రైన్ల ఫస్ట్ క్లాస్ టిక్కెట్టు ధర రూ.2200 మాత్రమే. ఇక.. ఈ రెండు నగరాల మధ్య ప్రస్తుతం టిక్కెట్టు ధర రూ.1589 రూపాయిలు మాత్రమే (జూన్ నెలలో టిక్కెట్ బుక్ చేసుకుంటే). విమానంలో కేవలం గంటా పదిహేను నిమిషాల్లో గమ్యస్థానం చేరే అవకాశం ఉన్నప్పుడు రూ.3300 పెట్టి బుల్లెట్ ట్రైన్లో ప్రయాణించే అవకాశం ఉంటుందా? అన్నది పెద్ద ప్రశ్న. బుల్లెట్ ట్రైన్ అన్నది ప్రజలకు మరింత సౌకర్యవంతంగా ఉండాలే కానీ.. వారికి భారంగా మారకూడదు కదా? బుల్లెట్ ట్రైన్ టిక్కెట్టు ధర చూస్తే గూబ గుయ్యమనేలా ఉన్న నేపథ్యంలో.. దీని ఆదరణ మీద సందేహాలు కలుగుతున్నాయి.
Tags:    

Similar News