సోమిరెడ్డికి సింగిల్ షాక్ స‌రిపోలేద‌బ్బా!

Update: 2019-05-01 09:58 GMT
టీడీపీ సీనియ‌ర్ నేత‌, ఏపీ కేబినెట్ లో వ్య‌వ‌సాయ శాఖ మంత్రిగా కొన‌సాగుతున్న సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి తీరు నిజంగానే చాలా ఆశ్చ‌ర్యంగా ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో ఉన్న నేప‌థ్యంలో సీఎం హోదా ఉన్న చంద్ర‌బాబు కూడా అధికారిక స‌మీక్ష‌ల‌కు దూరంగా ఉంటూ ఉంటే... సోమిరెడ్డి మాత్రం బ‌స్తీమే స‌వాల్ అంటూ త‌న‌దైన ముద్ర‌ను వేసేందుకు యత్నించారు. త‌న శాఖ‌కు సంబంధించిన స‌మీక్ష‌ను నిర్వ‌హిస్తాన‌ని, ఎవ‌రు అడ్డుకుంటారో చూస్తానంటూ స‌వాల్ చేయ‌డంతో పాటుగా అధికారులు రాకుంటే రాజీనామా చేసేస్తానంటూ బెదిరింపుల‌కు కూడా దిగిన వైనం నిజంగానే వైర‌ల్ గా మారిపోయింది.

నిన్న సోమిరెడ్డి స‌మీక్ష కోసం స‌చివాల‌యంలోని త‌న చాంబ‌ర్ కు రాగా... అధికారులంతా ముఖం చాటేశారు. ఏకంగా 3 గంట‌ల పాటు వేచి చూసిన సోమిరెడ్డి నిరాశ‌గా వెనుదిరిగారు. ఇత‌ర శాఖ‌ల అధికారుల సంగ‌తి అలా ప‌క్క‌న‌పెడితే... త‌న సొంత శాఖ‌కు చెందిన క‌మిష‌న‌ర్‌, ముఖ్య కార్య‌ద‌ర్శులే భేటీకి రాలేమ‌ని తేల్చి చెప్ప‌డం చూస్తుంటే... సోమిరెడ్డికి నిన్న‌టి షాక్ మామూలుగా తగ‌ల‌లేదనే చెప్పాలి. అయితే సోమిరెడ్డి లాంటి హార్డ్ కోర్ పొలిటీషియ‌న్ కు సింగిల్ షాక్ లు చాల‌వ‌నే చెప్పాలి. అందుకేనేమో... నిన్న‌టి షాక్ ను ప‌క్క‌న‌పెట్టేసి నేడు కూడా ఆయ‌న స‌మీక్ష కోస‌మంటూ త‌న ఛాంబ‌ర్ కు వ‌చ్చారు.

నిన్న వ్య‌వ‌సాయ శాఖ స‌మీక్ష అన్న సోమిరెడ్డి... నేడు ఉద్యాన‌వ‌న శాఖ స‌మీక్ష అన్నారు. అయితే వ్య‌వ‌సాయ శాఖ అధికారులకు మ‌ల్లే... ఉద్యాన‌వ‌న శాఖ అధికారులు కూడా సోమిరెడ్డికి షాకే ఇచ్చారు. ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో ఉన్న నేప‌థ్యంలో తాము కూడా స‌మీక్ష‌కు హాజ‌రు కాలేమంటూ సోమిరెడ్డికి ముఖం మీదే చెప్పేశార‌ట‌. దీంతో సోమిరెడ్డికి వ‌రుస‌గా రెండో రోజు కూడా షాక్ త‌గిలింది. నిన్న‌టి ఘ‌ట‌న‌తోనే సోమిరెడ్డి రాజీనామాకు డిమాండ్లు వెల్లువెత్త‌గా... నేటి సెంక‌డ్ షాక్ తో ఈ డిమాండ్ల జోరు మ‌రింత‌గా పెరిగే అవ‌కాశాలే ఉన్నాయ‌ని చెప్ప‌క తప్ప‌దు.

Tags:    

Similar News