భారతి సిమెంట్ ధర కూడా తగ్గించమంటున్న తెలుగు తమ్ముడు

Update: 2021-12-27 10:33 GMT
క్యాలెండర్ లో తేదీలు మారే కొద్దీ.. అవి ఇవి అన్న తేడా లేకుండా అన్ని వస్తువుల ధరలకు రెక్కలు రావటం మామూలే. పెరిగే జీతాలు అందుకు అనుగుణంగా పెరిగే ధరలు ఒక బండికి రెండు చక్రాలు అన్నచందంగా ఉంటాయి. అన్ని పెరిగిపోతున్న వేళ.. వాటి గురించి మాట్లాడని ప్రభుత్వాలు.. అందుకు భిన్నంగా తాము దేనినైనా లక్ష్యంగా చేసుకున్నప్పుడు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా మాట్లాడే తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఏపీలోని సినిమా టికెట్ల ధరల్ని భారీగా తగ్గించటమే కాదు.. ప్రభుత్వం నిర్ణయించిన ధరలతో సినిమా థియేటర్లను నడిపితే.. షో కు అయ్యే కరెంటు ఖర్చు కూడా రాని దుస్థితిని చాలా థియేటర్లు ఎదుర్కొంటున్నాయి.

దీంతో.. గడిచిన వారంలో పెద్ద ఎత్తున థియేటర్లను స్వచ్ఛందంగా మూసేస్తున్నారు. ఓవైపు ప్రభుత్వం వసూలు చేసే పెట్రోల్.. డీజిల్ మీద పన్ను శాతాన్ని తగ్గించమంటే తగ్గించరు కానీ సినిమా టికెట్ల ధరల్ని అంత భారీగా ఎలా తగ్గిస్తారన్న ప్రశ్న వ్యక్తమవుతోంది.

గడిచిన కొద్ది రోజులుగా సినిమా టికెట్ల మీద నడుస్తున్న రచ్చ మామూలుగా లేదు.ఇదిలాఉంటే తాజాగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి తనదైన శైలిలో సినిమా టికెట్ల ధరలపై విరుచుకుపడ్డారు.

ట్విటర్ వేదికగా విరుచుకుపడిన ఆయన.. ఏపీలో సిమెంట్ బస్తా రేటును రూ.100కు తీసుకురావాలన్నారు. అలా చేస్తే దేశ చరిత్రలో నిజంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు వస్తుందని పేర్కొన్నారు. నిజంగానే చిత్తశుద్ధి ఉన్న సీఎంగా పేరు తెచ్చుకోవాలని కోరారు. సిమెంట్ బ్యాగ్ మీద కమిషన్లు తగ్గించుకోవాలని.. అప్పుడే వాటి ధరలు తగ్గుతాయన్నారు. పెద్ద హీరోల పారితోషికాల్ని తగ్గించుకోవాలన్నారు కదా.. మీ కమిషన్ కూడా తగ్గించుకోవాలన్నారు బుచ్చయ్య చౌదరి.

జగన్ కుటుంబ సంస్థ అయిన భారతి సిమెంట్ ఉత్పత్తి చేసే సిమెంట్ బస్తాను రూ.100కు తీసుకొచ్చి ఆదర్శంగా నిలవాలన్నారు. అంతేకాదు.. ఉచితంగా ఇల్లు ఇస్తామని చెప్పి ఐదు బస్తాలు భారతి సిమెంట్ కచ్ఛితంగా కొనాలని ఒత్తిడి చేస్తున్నారన్నారు. దీనిలో ఉన్న మర్మం ఏమిటో కూడా చెప్పాలన్నారు.

సినిమా టికెట్ల ధరలు తగ్గించిన జగన్ సర్కారు.. పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ కక్షతోనే ఇలా చేస్తున్నట్లు చెబుతూ.. నిజంగానే ధరలు తగ్గించానల్నదే పాయింట్ అయితే.. జగన్ కుటుంబానికి చెందిన సాక్షి మీడియా సంస్థకు చెందిన పేపర్.. భారతి సిమెంట్ ధరల్ని తగ్గించాలంటూ పోస్టులు పెడుతున్న వారు అంతకంతకూ ఎక్కువ అవుతున్నారు. మరి.. దీనికి వైసీపీ నేతలు ఎలా రియాక్టు అవుతారో చూడాలి.
Tags:    

Similar News