బుట్టా రేణుక ఇచ్చిన క్లారిఫికేష‌న్లు విన్నారా?

Update: 2017-07-16 10:20 GMT
త‌మ‌దైన ప్రచారంతో ఏపీ విప‌క్ష పార్టీని దెబ్బ తీయాల‌ని.. గంద‌ర‌గోళానికి గురి చేయాల‌న్న‌త‌లంపు ఈ మ‌ధ్యన ఎక్కువైంది. ఇటీవ‌ల కాలంలో అంద‌రికి అందుబాటులోకి వ‌చ్చిన సోష‌ల్ మీడియాను అస‌రా చేసుకొని ఏపీ విప‌క్షంపై దుష్ప్ర‌చారం చేస్తున్నారు. ఇటీవ‌ల ముగిసిన పార్టీ ప్లీన‌రీతో కొత్త ఉత్సాహంతో ఉర‌క‌లెత్తుతున్న పార్టీ శ్రేణుల్ని  గంద‌ర‌గోళానికి గురి చేసేలా.. క‌ర్నూలు ఎంపీ బుట్టా రేణుక పార్టీ మారుతుంద‌న్న ప్ర‌చారాన్ని మొద‌లు పెట్టారు.

ఇలాంటి వార్త‌ల్ని న‌మ్మ‌ర‌న్న ఉద్దేశంతో.. కొన్ని కార‌ణాల్ని త‌మ వాద‌న‌కు బ‌లంగా చూపిస్తూ.. పార్టీ మారుతున్నారంటూ రూమ‌ర్స్ ను స్ప్రెడ్ చేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో ఒక మీడియా సంస్థ‌తో బుట్టా రేణుక ప్ర‌త్యేకంగా మాట్లాడారు. తాను పార్టీ మార‌టం లేద‌ని స్ప‌ష్టం చేసిన ఎంపీ బుట్టా.. త‌న మీద వ‌స్తున్న నాలుగు రూమ‌ర్ల‌ను ప్ర‌స్తావించి.. వాటికి స‌మాధానాలు ఇచ్చారు. ఇంత‌కూ ఆ నాలుగు రూమ‌ర్లు ఏమిటి?దానికి బుట్టా రేణుక ఇచ్చిన స‌మాధానాలు ఏమిట‌న్న‌ది చూస్తే..

రూమ‌ర్ 1

ఏపీ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కుమారుడు.. రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌ను క‌లిశారు

ఎంపీ బుట్టా క్లారిటీ

క‌ర్నూలు లోక్ స‌భా స్థానం ప‌రిధిలో నీటి స‌మ‌స్య చాలా ఎక్కువ‌గా ఉంది. ఈ నేప‌థ్యంలో స‌మ‌స్య ప‌రిష్కారం కోసం గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రిని క‌ల‌వ‌టం జ‌రిగింది. ఇందులో భాగంగా ఇప్ప‌టికే కేంద్ర‌మంత్రి తోమ‌ర్ ను క‌లిశాను. అదే శాఖ‌ను చూస్తున్న రాష్ట్ర మంత్రి లోకేశ్‌ను క‌లిసి.. కేంద్రానికి అందించిన విన‌తి ప‌త్రాన్ని ఇచ్చాను. రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున నుంచి చేయాల్సిన ప‌నులు పూర్తి చేయాల‌ని కోరాను. రాష్ట్ర మంత్రిగా ఉన్న లోకేశ్‌ను.. నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధిలో భాగంగా క‌ల‌వ‌టం త‌ప్పేం కాదు క‌దా?

రూమ‌ర్ 2

ఎంపీలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్ నిర్వ‌హించిన భేటీకి గైర్హాజ‌రు కావ‌టం

ఎంపీ బుట్టా క్లారిటీ

నా నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో కొన్ని అభివృద్ధి కార్య‌క్ర‌మాల్ని ముందుస్తుగా నిర్ణ‌యించుకున్నాం. అన్నింటికి మించి.. టీడీపీ నుంచి కొంద‌రు మా పార్టీలోకి చేరే కార్య‌క్ర‌మం ఉంది. ముందుగా అనుకున్న దాని కంటే ముందే స‌మావేశాన్ని నిర్వ‌హిస్తున్న‌ట్లు స‌మాచారం అందిన వెంట‌నే పార్టీ పెద్ద‌లు మేక‌పాటికి ఫోన్లో విష‌యాన్ని చెప్పాను. జ‌గ‌న్ అన్న‌కు మెసేజ్ చేశాను.

రూమ‌ర్ 3

మీ భ‌ర్త టీడీపీలో ఉన్నారు. మీరేమో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అందుకే.. పార్టీ మార్పు..

ఎంపీ బుట్టా రేణుక క్లారిటీ

అనుకోని రీతిలో యాక్సిడెంట‌ల్ గా టీడీపీ కండువా ఆయ‌న క‌ప్పుకోవ‌టం జ‌రిగింది. అంతేకానీ.. ఆయ‌న‌కు ఏ పార్టీతోనూ సంబంధాలు లేవు. బిజినెస్ లు చూసుకుంటున్నారు. అప్పుడెప్పుడో జ‌రిగిపోయిన దాని గురించి ఇన్నిసార్లు క్లారిటీ ఇచ్చిన త‌ర్వాత కూడా పాత ప‌ద్ధ‌తిలోనే ఆరోపించ‌టం స‌రికాదు. ఇప్ప‌డు నా భ‌ర్త ఏ పార్టీలో లేరు. ఒక‌వేళ ఏదైనా పార్టీలో ఉన్న‌ట్లు నిరూపిస్తూ నేను తెలుసుకుంటా. నా భ‌ర్త పూర్తిగా నాకు స‌హ‌కారం అందిస్తారు. అంటే.. ప‌రోక్షంగా ఆయ‌న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న‌ట్లు లెక్క‌. ఆయ‌న ఎక్క‌డ ఉంటే నేనూ అక్క‌డే ఉంటా.

రూమ‌ర్ 4

మీ తీరు మీద జ‌గ‌న్ అస‌హ‌నం వ్య‌క్తం చేశార‌ని..ఆగ్ర‌హం వ్య‌క్తం చేశార‌ని..

ఎంపీ బుట్టా క్లారిటీ

అలాంటి ప‌రిస్థితే లేదు. స‌మావేశం వెళ్ల‌క‌పోవ‌టంపై వినిపిస్తున్న రూమ‌ర్ల‌ను జ‌గ‌న్ అన్న చిరున‌వ్వుతో కొట్టిపారేసిన‌ట్లు మా ఎమ్మెల్యేలు చెప్పారు. మీటింగ్‌కు రావ‌టం లేద‌ని స‌మాచారం ఇచ్చిన త‌ర్వాత కూడా ఇలాంటి వార్త‌లు ఎవ‌రు క్రియేట్ చేస్తున్నార‌ని కూడా జ‌గ‌న్ అన్న అన్నట్లు చెప్పారు. ఆయ‌న నా మీద ఎలాంటి ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌లేదు. మ‌రోసారి చెబుతున్నాను. వంద‌శాతం నేను వైఎస్సార్ కాంగ్రెస్ లోనే ఉన్నాను.. ఉంటాను కూడా. ఒక పార్టీలో గెలిచి మ‌రో పార్టీలోకి వెళ్ల‌టం స‌రికాద‌ని చెప్పే నేను.. వేరే పార్టీలోకి వెళ్లే ఛాన్సే లేదు.
Tags:    

Similar News