సంచ‌ల‌నం సృష్టిస్టున్న క‌లెక్ట‌ర్ ఆత్మ‌హ‌త్య‌

Update: 2017-08-11 07:31 GMT

ఎన్నో ఆశ‌ల‌తో - ప్ర‌జ‌ల‌కు ఏదైనా చేయాల‌నే ఉన్న‌త లక్ష్యంతో సివిల్ స‌ర్వీసెస్‌ లోకి అడుగుపెడుతున్న యువ‌త‌ అర్ధంత‌రంగా బ‌ల‌వ‌న్మర‌ణాల‌కు పాల్ప‌డుతున్నారు. ఒత్తిడిని త‌ట్టుకోలేకో లేక‌.. ఇత‌ర ఇబ్బందులను ఎదుర్కోలేకో విలువైన జీవితాన్ని స‌గంలోనే ముగిస్తున్నారు. క‌న్నవారి క‌ల‌ల‌ను క‌ల్లలు చేస్తూ.. ఆత్మ‌హ‌త్య‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నారు. ప్ర‌స్తుతం ఒక యువ‌ ఐఏఎస్ త‌నువు చాలించిన సంఘ‌ట‌న సంచ‌ల‌నం సృష్టిస్తోంది. యువ ఐఏఎస్‌ లు ఆత్మ‌హ‌త్య ల‌కు పాల్ప‌డుతున్నార‌ని కేంద్రం కూడా సీరియ‌స్‌ గా దృష్టిసారించిన నేపథ్యంలో.. ఈ సంఘ‌ట‌న మ‌రింత చ‌ర్చ‌నీయాంశంగా మారింది. బిహార్‌ లో జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌.. క‌ల‌క‌లం రేపుతోంది.

బిహార్‌.. అధికారుల ఒత్తిళ్లు - రాజ‌కీయ ప‌లుకుబ‌డి - ముఖ్యంగా రౌడీ మూక‌లకు పెట్టింది పేరు! ఇక్క‌డ ప‌నిచేయ‌డమంటే అధికారుల‌కు స‌వాల్ లాంటిదే! ప్ర‌స్తుతం బిహార్‌ లోని బ‌క్స‌ర్ జిల్లా క‌లెక్ట‌ర్‌ గా ప‌నిచేస్తున్న ముకేశ్ పాండే బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడు. వేగంగా వ‌స్తున్న రైలుకు ఎదురెళ్లి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి ఆసక్తిక‌రమైన అంశాలు అత‌డు రాసిన సూసైడ్ నోట్‌ లో ల‌భ్య‌మ‌య్యాయి. ఢిల్లీ శివారు ఘజియాబాద్‌ స్టేషన్‌ కు సమీపంలో గురువారం జీఆర్పీ పోలీసులు ఆయన మృతదేహాన్ని గుర్తించారు. అత‌ని దుస్తుల్లో ల‌భించిన కాగితం ఆధారంగా.. ముకేశ్ బసచేసిన హోటల్‌ గదిలో సూసైడ్‌ నోట్‌ ను స్వాధీనం చేసుకున్నారు.

`నేను.. ముఖేశ్‌ పాండే - ఐఏఎస్‌ 2012 బ్యాచ్‌ బిహార్‌ క్యాడర్‌ అధికారిని. ప్రస్తుతం బక్సర్‌ జిల్లా మేజిస్ట్రేట్‌(కలెక్టర్‌)గా పనిచేస్తున్న నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. నా చావు వార్తను మా వాళ్లకు తెలియజేయండి. ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలన్నింటినీ ఒక నోట్‌లో రాశాను. లీలా ప్యాలెస్‌ హోటల్‌(ఢిల్లీ)లో నేను దిగిన రూమ్‌ నంబర్‌ 742లో నైక్‌ బ్యాగ్‌ లో ఆ నోట్‌ ఉంది` అని ముఖేశ్‌ ట్రౌజర్‌ లో దొరికిన కాగితంలో రాసి ఉంది. దాని ఆధారంగా హోటల్‌ గదికి వెళ్లిన పోలీసులు సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. `మనిషి అనేవాడికి ఇక్కడ మనుగడ లేకుండా పోయింది. బతకాలనే కోరిక చచ్చిపోయింది. అందుకే నేను ఆత్మహత్య చేసుకుంటున్నా..` అని అందులో రాశాడు.
Tags:    

Similar News