శ్రీవారి దర్శనం చెప్పలేం కానీ.. లడ్డూ మాత్రం సగం ధరకే ఇచ్చేస్తారట

Update: 2020-05-21 04:30 GMT
ఆ రోజు.. ఈ రోజు అన్న తేడా లేకుండా నిత్యం కల్యాణం.. పచ్చ తోరణంలా ఉండే పుణ్యక్షేత్రాల్లో తొలి స్థానంలో ఉంటుంది తిరుమల శ్రీవారి ఆలయం. తక్కువ అంటే నలభై వేల మంది వరకూ స్వామివారిని దర్శనం చేసుకుంటారు భక్తులు. ప్రత్యేక సమయాల్లో ఈ సంఖ్య 65వేలకు కూడా దాటేసే పరిస్థితి. స్వామి దర్శనం కోసం తపించే భక్తులకు మాయదారి రోగం బ్రేకులు వేసింది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో భక్తుల్ని అనుమతించేందుకు టీటీడీ నో చెప్పేసింది. దీంతో.. గడిచిన రెండు నెలలుగా స్వామివారి దర్శన భాగ్యం లేని పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితుల్లోనూ స్వామివారి దర్శనాన్ని ఎప్పటి నుంచి షురూ చేస్తారో కూడా అంతు చిక్కని విధంగా మారింది. ఇలాంటి వేళ.. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శుభవార్తను చెప్పారు. లాక్ డౌన్ నేపథ్యంలో అన్ని ఖరీదెక్కిపోయిన వేళ.. అందుకు భిన్నంగా శ్రీవారి ప్రసాదమైన లడ్డూను సగం ధరకే అందిస్తామని.. అది కూడా బుకింగ్ సౌకర్యంతో ఎన్ని లడ్డూలైనా అందిస్తామని చెప్పారు.

భక్తుల కోరిక మేరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని టీటీడీ కల్యాణ మండపాల్లోనే కాదు.. చెన్నై.. బెంగళూరులోనూ అందుబాటులో ఉంచుతామని చెబుతున్నారు. ఇప్పటివరకూ రూ.50కు అమ్మిన లడ్డూను ఇకపై రూ.25కు అమ్ముతామని వైవీ సుబ్బారెడ్డి చెబుతున్నారు. ముందుగా బుకింగ్ చేసుకోవాలే కానీ వేలాది లడ్డూలు అందించటానికి సైతం సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

పెద్ద ఎత్తున లడ్డూలు కావాలనుకునే వారు 98495 75952, 97010 92777 నెంబర్లను సంప్రదిస్తే సరిపోతుందని చెప్పారు. ఇకపై రోజూ మూడు లక్షల లడ్డూల్ని తయారు చేయనున్నట్లు చెప్పారు. స్వామివారి దర్శనం లేకున్నా.. కనీసం ఆయన ప్రసాదమైనా లభించటం మహా భాగ్యమని ఎగబడి కొనేసే అవకాశం ఉందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా అయినా.. అంతో ఇంతో యాక్టివిటీ స్టార్ట్ కావటమే కాదు.. భక్తుల కోరికను కొంతమేర అయినా తీర్చినట్లు అవుతుందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.
Tags:    

Similar News