జేసీ బ్ర‌ద‌ర్స్ వ‌ర్సెస్ త‌మ్ముళ్లు..మండిప‌డ్డ బైరెడ్డి

Update: 2017-01-18 10:01 GMT
అనంతపురం జిల్లాలో జేసీ  బ్రద‌ర్స్ క‌ల‌క‌లం కొన‌సాగుతున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. జేసీ బ్ర‌ద‌ర్స్‌లో ఒక‌రైన ప్ర‌భాక‌ర్ రెడ్డి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న తాడిపత్రిలో తమ్ముళ్ల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. టీడీపీ నేత జగదీశ్వర్‌ రెడ్డి సోదరులు ఒక‌వైపు, మరో వైపు ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి ముఖ్య అనుచరులు రవీంద్రారెడ్డిలు ఒకరిపై మరొకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటున్నారు. ఒకరు మున్సిపాలిటీ అవినీతిపై కరపత్రాలు విడుదల చేస్తే మరోకరు వ్యక్తిగత అక్రమాలపై కరపత్రాలు పంపిణీ చేశారు. ఇది తారాస్థాయికి చేరి రెండు గ్రూపులు బహిరంగ చర్చకు సిద్ధం కావడంతో పట్టణంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విషయం తెలుసుకున్న తాడిపత్రి పట్టణ సీఐ రామక్రిష్ణారెడ్డి - రూరల్‌ సిఐ అస్రాబాషాలు టిడిపి యువజన నాయకులు రవీంద్రారెడ్డి - 23వ వార్డు కౌన్సిలర్‌ జయచంద్రారెడ్డి ఆయన సోదరుడు జగదీశ్వర్‌ రెడ్డిని - మైనార్టీ నాయకులు కెవి.రషీద్‌ - మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ జిలానీబాషాలను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రెండు గ్రూపుల నాయకులకు కౌన్సిలింగ్‌ ఇచ్చి విడుదల చేశారు.

ఇదిలాఉండ‌గా.. తెలుగుదేశం పార్టీ ప‌రిపాల‌న‌పై ఆ పార్టీ మాజీ నేత రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు అనుమతి లేదని అధికారులు చెప్పడం సిగ్గుచేటనీ మండిప‌డ్డారు. సీమకు జరుగుతున్న దోపిడీని ప్రజల దృష్టికి తీసుకెళ్లి, న్యాయం జరగాలని కోరుతూ 10 డిమాండ్లతో ఈ నెల 18 - 19 తేదీలలో శాంతియుత నిరసన దీక్ష చేపట్టేందుకు అనుమతిని కోరగా... సరైన కారణం లేకుండా అనుమతి నిరాకరించిన జిల్లా అధికారులపై బైరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి నుంచి వచ్చిన ఆజ్ఞలను తూచ తప్పకుండా పాటిస్తున్న అధికారులు పచ్చచొక్కాలు ధరించి విధులు నిర్వహిస్తే బాగుంటుందనీ బైరెడ్డి విమ‌ర్శించారు. మానవ హక్కుల సంఘాన్ని, న్యాయస్థానాన్ని ఆశ్రయించి అనుమతి తెచ్చుకుంటామని బైరెడ్డి తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News