జ‌గ‌న్ ఎఫెక్ట్‌!... బైరెడ్డికి బాబు ఓకే!

Update: 2017-12-29 05:41 GMT
క‌ర్నూలు జిల్లాకు చెందిన కీల‌క రాజ‌కీయ వేత్త - మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజ‌శేఖ‌ర‌రెడ్డి త‌న సొంత గూటిలో చేరేందుకు దాదాపుగా రంగం సిద్ధ‌మైపోయింద‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి.  తన తండ్రి బైరెడ్డి శేష‌శ‌య‌నారెడ్డి హ‌యాం నుంచి కూడా టీడీపీలో కొన‌సాగుతూ వ‌స్తున్న బైరెడ్డి... జిల్లాలోని నందికొట్కూరును త‌న‌కు పెట్ట‌ని కోట‌గా చేసుకున్నారు. అయితే ఫ్యాక్ష‌నిస్ట్‌ గా ముద్ర‌ప‌డ్డ బైరెడ్డికి జిల్లాలోని ఇత‌ర ప్రాంతాల్లో అంత‌గా ప‌ట్టు ల‌భించ‌లేద‌న్న వాద‌న ఉంది. టీడీపీలో ఉండ‌గానే... అటు కేఈ కృష్ణ‌మూర్తి వ‌ర్గంతో ఢీ అంటే ఢీ అంటూ సాగిన బైరెడ్డి... జిల్లాలోని మిగిలిన టీడీపీ నేత‌ల‌తోనూ పెద్ద‌గా స‌ఖ్య‌త‌గా మెల‌గ‌లేక‌పోయారు. అదే స‌మ‌యంలో మొన్న రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత టీడీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసిన బైరెడ్డి... రాయ‌ల‌సీమ ప‌రిర‌క్ష‌ణ స‌మితి (ఆర్పీఎస్)పేరిట ఓ పార్టీని ఏర్పాటు చేసుకుని ప్ర‌త్యేక రాయ‌ల‌సీమ కోసం పోరు సాగించారు. అయితే జిల్లా వ్యాప్తంగా త‌నకు కేడ‌ర్ లేక‌పోవ‌డంతో బైరెడ్డి... స‌ద‌రు ఉద్య‌మాన్ని కూడా దిగ్విజ‌యంగా ముందుకు తీసుకెళ్ల‌లేక‌పోయార‌నే చెప్పాలి. మొత్తం రాయ‌ల‌సీమ వ్యాప్తంగా యాత్ర చేసినా...  బైరెడ్డికి పెద్ద‌గా క‌లిసి వ‌చ్చిన దాఖ‌లా క‌నిపించ‌లేదు.

ఈ క్ర‌మంలో బైరెడ్డి వైసీపీలో చేరుతార‌ని ఒకానొక సంద‌ర్భంలో పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. అయితే బైరెడ్డి మ‌న‌స్త‌త్వం తెలిసిన వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆయ‌న ప‌ట్ల పెద్ద‌గా ఆస‌క్తి చూప‌లేద‌ట‌. దీంతో అస‌లు ఆ దిశ‌గా య‌త్నాల‌ను మానేసిన బైరెడ్డి... తిరిగి సొంత గూడు టీడీపీలో చేరేందుకు ముమ్మ‌ర య‌త్నాలు ప్రారంభించారు. అయితే బైరెడ్డి కార‌ణంగా టీడీపీ జ‌రిగిన భారీ న‌ష్టాన్ని గుర్తుకు తెచ్చుకున్న టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు మ‌రోమారు బైరెడ్డిని పార్టీలోకి తీసుకునేందుకు అంతగా ఆస‌క్తి క‌న‌బ‌ర‌చ‌లేదు. ఈ నేప‌థ్యంలో మొన్న‌టికి మొన్న ఆర్పీఎస్‌ ను ర‌ద్దు చేస్తున్న‌ట్లుగా ప్ర‌క‌టించిన బైరెడ్డి... ఓ రాజ‌కీయ వేదిక లేకుండానే కేవ‌లం బైరెడ్డి వ‌ర్గంగా కొన‌సాగుతూ జిల్లాలో ఏ ఎన్నిక‌లు వ‌చ్చినా అభ్య‌ర్థుల‌ను దించుతూ త‌న‌దైన శైలి వ్యూహాన్ని అమ‌లు చేశారు. ఇప్పుడు క‌ర్నూలు స్థానిక సంస్థ‌ల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌కు సంబంధించి వైసీపీ బ‌రి నుంచి త‌ప్పుకున్నా... టీడీపీ అభ్య‌ర్థిగా ఖ‌రారైన కేఈ ప్ర‌భాక‌ర్‌ పై బైరెడ్డి త‌న అభ్య‌ర్థిని బ‌రిలోకి దింపారు. ఈ క్ర‌మంలో బైరెడ్డిని సైలెంట్‌ గా ఉంచ‌క‌పోతే.. ముందుముందు ఇబ్బంది త‌ప్ప‌ద‌న్న భావ‌న‌తో చంద్ర‌బాబు త‌న క‌ఠిన వైఖ‌రిని మార్చుకున్న‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

అంతేకాకుండా జ‌గ‌న్ సామాజిక వ‌ర్గానికి చెందిన బైరెడ్డిని పార్టీలోకి ఆహ్వానిస్తే... క‌నీసం ఓ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో అయినా వైసీపీని దెబ్బ తీయ‌వ‌చ్చ‌న్న కోణంలోనూ చంద్ర‌బాబు యోచించార‌ట‌. అదే స‌మ‌యంలో ఆర్పీఎస్‌ ను ర‌ద్దు చేసి ఎప్పుడెప్పుడు టీడీపీలో చేర‌దామా? అంటూ ఎదురు చూస్తున్న బైరెడ్డి ఆస‌క్తిని క్యాష్ చేసుకునేందుకు ప‌క్కా ప్లాన్ వేసిన చంద్ర‌బాబు... నేరుగా బైరెడ్డికి క‌బురు పంపార‌ట‌. దీంతో నిన్న సాయంత్రం విజ‌య‌వాడ వ‌చ్చిన బైరెడ్డి... బాబుతో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. మొత్తానికి రాజ‌కీయ అంశాలేమీ త‌మ మ‌ధ్య చ‌ర్చ‌కు రాలేద‌ని చెప్పిన బైరెడ్డి... తాను టీడీపీలో చేరే విష‌యంలో మాత్రం బాబు సానుకూల‌త వ్య‌క్తం చేసిన‌ట్లుగా ప‌రోక్ష సంకేతాలు ఇచ్చారు. త‌న కార్య‌క‌ర్త‌ల‌తో చ‌ర్చించి... సంక్రాంతి త‌ర్వాత టీడీపీలో చేరే విష‌యంపై ప్ర‌క‌ట‌న చేస్తాన‌ని కూడా బైరెడ్డి ప్ర‌క‌టించారు. మొత్తానికి గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో వైసీపీకి పూర్తి స్థాయి మ‌ద్ద‌తు ప‌లికిన క‌ర్నూలు జిల్లాలో ఆ పార్టీని దెబ్బ కొట్టేందుకు ఇష్టం లేక‌పోయినా... ఇప్పుడు బైరెడ్డి రీ ఎంట్రీకి బాబు ఓకే అన్నార‌న్న దిశ‌గా విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.
Tags:    

Similar News