ప‌వ‌న్ ప్ర‌త్యేక పోరు కుట్ర అంటోన్న బైరెడ్డి

Update: 2016-08-30 06:29 GMT
ప్ర‌త్యేక రాయ‌ల సీమ‌- అంటూ ఆ మ‌ధ్య కొన్నాళ్లు ఆందోళ‌న చేసి.. ఆ త‌ర్వాత నిరాహార దీక్ష‌కు కూడా దిగి.. కొన్నాళ్లు గ‌డిచాక తెర‌మ‌రుగై పోయిన బైరెడ్డి రాజ‌శేఖ‌ర‌రెడ్డి గుర్తున్నారా ? అంత‌గా గుర్తుంచుకోవాల్సిన అవ‌స‌రం కూడా లేదేమో! ఎందుకంటే.. ఎప్పుడు ఎవ‌రిని పొగుడుతాడో? ఎప్పుడు ఎవ‌రిని తిడ‌తాడో? ఆయ‌న‌కే తెలీదు. అదేవిధంగా ఆయ‌న చేసే పోరాటాల‌కూ ఓ స్టాండ్ ఉండ‌ద‌ని ఆయ‌న అనుచ‌రులే అంటుంటారు. రాష్ట్ర విభ‌జ‌న స‌య‌మంలో ప్ర‌త్యేక సీమ కావాల‌ని, దానికి క‌ర్నూలు రాజ‌ధాని కావాల‌ని, నాలుగు జిల్లాల‌ను 14 జిల్లాలు చేయాల‌ని డిమాండ్ చేసిన బైరెడ్డి.. త‌ర్వాత కొన్నాళ్ల‌కు రాజ‌ధానిపై యాగీ చేశారు. రాజ‌ధానిని కోస్తాలో కాదు సీమ‌లో  ఏర్పాటు చేయండి అంటూ ఆందోళ‌న‌కు దిగి నిరాహార దీక్ష‌కు సైతం కూర్చున్నారు.

ఆశించిన మైలేజీ రాక‌పోవ‌డంతో త‌ర్వాత సైలెంట్ అయిపోయారు. ఆ త‌ర్వాత దాదాపు తెర‌మ‌రుగైపోయార‌నుకున్న స‌మ‌యంలో మ‌ళ్లీ ఇప్పుడు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌ పై కామెంట్ల‌తో మీడియా ముందుకు వ‌చ్చారు. నిన్న నిర్వ‌హించిన ఓ చోటా స‌భ‌లో బైరెడ్డి మాట్టాడుతూ.. ప‌వ‌న్‌ పై విమ‌ర్శ‌లు చేశారు. సీమ ప్రాంతాన్ని ప్ర‌త్యేక రాష్ట్రంగా ఎక్క‌డ ప్ర‌క‌టించాల్సి వ‌స్తుందోన‌న్న భ‌యంలో భాగంగానే చంద్ర‌బాబు - ప‌వ‌న్‌ లు క‌ల‌సి కుట్ర ప‌న్నుతున్నార‌ని, అందుకే ప‌వ‌న్ ముందుండి ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంపై పోరాడ‌తాన‌ని చెప్పారంటూ.. రెండు సంబంధం లేని విష‌యాల‌ను ముడిపెట్టేందుకు ప్ర‌య‌త్నించారు బైరెడ్డి. రాయలసీమ వాదాన్ని తొక్కిపెట్టే కుట్రలో భాగంగా ప్రత్యేక హోదా ఉద్యమాన్ని తెరపైకి తెస్తున్నారని ఆయన ఆరోపించారు.

 పవన్ కళ్యాణ్‌ తో ఏపీ సీఎం చంద్రబాబు ఆడిస్తున్న నాటకాల పైన రాయలసీమ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరించారు. ఉద్యమాలు అంటే టిక్కెట్ కొని మూడు గంటలు ఎంజాయ్ చేసే సినిమాలు కాదనే విషయం ప‌వ‌న్ త‌న అన్న చిరంజీవి నుంచి తెలుసుకోవాల‌ని హిత బోధ కూడా చేసేశారు. రాయలసీమలో పెట్టవలసిన రాజధానిని అమరావతికి తీసుకు వెళ్తే పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు విప్పలేదని ప్రశ్నించారు. ప‌వ‌న్ - చంద్ర‌బాబుల కుట్ర‌లో సీమ ప్ర‌జ‌లు ఇరుక్కోవ‌ద్ద‌ని సూచించారు. బైరెడ్డి వ్యాఖ్య‌ల‌తో కాసేపు ఎంజాయ్ చేసిన స్థానికులు త‌ర్వాత అక్క‌డి నుంచి వెళ్లిపోవ‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News