జగన్ అడ్డాలో బైరెడ్డికి దారుణ అవమానం

Update: 2016-06-14 06:26 GMT
నాయకులు అనే వారు ఏం మాట్లాడినా నడుస్తుందని.. తాము ఏం చెప్పినా జనాలు వింటారన్న భావనను నేతలు వదిలించుకోవాల్సిన అవసరం ఉంది. తాజాగా.. రాయలసీమకు చెందిన ఒక నేతకు ఎదురైన చేదు అనుభవమే దీనికి నిదర్శనం. ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకా పులివెందులలో.. కర్నూలు జిల్లా నేత.. రాయలసీమ పరిరక్షణ సమితి అధినేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డికి ఊహించని పరాభవం ఒకటి ఎదురైంది. పార్టీల నుంచి బయటకు వచ్చి.. సొంత కుంపటి పెట్టుకున్న ఆయన సీమ సెంటిమెంట్ తో చెలరేగిపోతున్న పరిస్థితి. రైతు రుణాలు.. డ్వాక్రా రుణాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీల్ని అమలు చేయటం లేదంటూ మండిపడుతూ విమర్శలు గుప్పించారు.

పులివెందుల నియోజకవర్గం లింగాల మండలం పార్నపల్లెలో పర్యటించిన సందర్భంగా బైరెడ్డి ఊహించని పరిణామాన్ని ఎదుర్కొన్నారు. రాయలసీమ ప్రజల గొంతు కోసి ఆంధ్రాలో అమరావతి అంటూ రాజధానిని నిర్మిస్తున్నారని.. రైతులకు.. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు.. ముఖ్యమంత్రి అయ్యాక ఆ విషయాన్ని మర్చిపోయారంటూ తనదైన శైలిలో మండిపడ్డారు. ఎన్నికల సందర్భంగా బాబు చెప్పిన హామీల్ని ఒకటి తర్వాత ఒకటి అన్నట్లుగా విమర్శలు గుప్పిస్తున్న ఆయనపై.. కొందరు గుస్సా ప్రదర్శించారు.

రైతు రుణమాఫీ హామీ అమలు కాలేదంటూ బైరెడ్డి చేస్తున్న విమర్శల్ని అడ్డుకున్న పార్నపల్లెలోని కొందరు యువకులు... ‘రుణమాఫీ ఎక్కడ మాఫీ కాలేదో చెప్పాలంటూ బైరెడ్డికి క్వశ్చన్ చేశారు. దీనిపై తడబాటుకు గురైన ఆయన ఏదో చెప్పబోతున్నంతలో అక్కడున్న వారంతా తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని.. అబద్ధపు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడిన యువకులు ఆయనపై కోడిగుడ్లతో దాడికి పాల్పడ్డారు. ఊహించని పరిణామానికి షాక్ తిన్న బైరెడ్డి.. తన ప్రచారాన్ని మధ్యలో ఆపేసి వెనుదిరిగారు. అదే పనిగా పసలేని విమర్శలు చేస్తే జనాలు ఊరుకోరన్న విషయం బైరెడ్డి అనుభవంలోకి వచ్చి ఉంటుందేమో.
Tags:    

Similar News