టీడీపీలో చేరికపై బైరెడ్డి సిద్ధార్థ్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

Update: 2022-11-07 10:30 GMT
టీడీపీలో చేరికపై ఆంధ్రప్రదేశ్‌ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్‌) చైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థ్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను టీడీపీలో ఎందుకు చేరతానని ప్రశ్నించారు. తనకు సీఎం వైఎస్‌ జగన్‌ కీలక బాధ్యతలు అప్పగించారని గుర్తు చేశారు. కర్నూలు జిల్లా నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్‌చార్జిగా, శాప్‌ చైర్మన్‌గా సీఎం జగన్‌ అవకాశమిచ్చారని సిద్ధార్థ్‌ రెడ్డి అన్నారు. తనకు ఇంత ప్రాధాన్యత ఇచ్చినప్పుడు తానెందుకు పార్టీ మారతానని ఎదురు ప్రశ్నించారు.

ఇటీవల తాను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌లో భేటీ అయినట్లు వచ్చిన వార్తలన్నీ అవాస్తవాలని తేల్చిచెప్పారు. అలాగే నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్‌తో తనకు విభేదాలున్నాయని జరుగుతున్న ప్రచారాన్ని బైరెడ్డి సిద్ధార్థ్‌ రెడ్డి ఖండించారు.

వైసీపీలో రాకముందు ఐదారేళ్ల క్రితం తాను టీడీపీలో చేరేందుకు ప్రయత్నించానని ఆయన చెప్పారు. తన తల్లి ఉషారాణిరెడ్డిని కడప నుంచి పోటీ చేయించడానికి టీడీపీ ప్రయత్నించిందని తెలిపారు. తాను లోకేష్‌ను కానీ, చంద్రబాబును కానీ కలవలేదన్నారు. టీడీపీ వాళ్లే తన తల్లిని పోటీ చేయించాలని చెప్పి ఎన్నిసార్లు తమ దగ్గరకు వచ్చారో చంద్రబాబును అడిగి తెలుసుకోవాలని సిద్ధార్థ్‌ రెడ్డి ఫైరయ్యారు. ఈ మేరకు తాజాగా ఒక  మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బైరెడ్డి సిద్ధార్థ్‌ రెడ్డి హాట్‌ కామెంట్స్‌ చేశారు.

టీడీపీలో చేరేందుకు తాను ఎవరి కాళ్లు పట్టుకోలేదని.. ఎవరి ద్వారానో ప్రయత్నాలు కూడా చేయలేదన్నారు. 2009, 2014 ఎన్నికల్లో తన తల్లిని పోటీ చేయించడానికి టీడీపీ వాళ్లే చాలాసార్లు తమ వద్దకు వచ్చారన్నారు.

కాగా గత ఎన్నికల ముందు వైసీపీలో చేరిన సిద్థార్థ్‌ రెడ్డికి మొదట్లో జగన్‌ ఏ పదవీ కేటాయించలేదు. దీంతో ఆయన టీడీపీలో చేరుతున్నారని..  ఈ మేరకు నారా లోకేష్‌తో చర్చలు కూడా జరిపినట్టు వార్తలు కూడా వచ్చిన సంగతి తెలిసిందే.

ఆ తర్వాత బైరెడ్డి సిద్ధార్థ్‌ రెడ్డికి శాప్‌ చైర్మన్‌గా జగన్‌ అవకాశమిచ్చారు. అంతేకాకుండా వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన అధ్యక్షుడిగా కూడా సిద్థార్థ్‌ రెడ్డిని నియమించారు. మరోవైపు నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గం ఇన్‌చార్జ్‌గా కూడా బైరెడ్డి ఉన్నారు.

తనను పిల్లోడు అని ఇతర రాజకీయ పార్టీల నేతలు అనడంపై కూడా బైరెడ్డి సిద్థార్థ్‌ రెడ్డి మండిపడ్డారు. తాను వారిని ముసలోడు అనడం వల్ల, వాళ్లు తనను పిల్లోడు అనడం వల్ల ఎలాంటి లాభం లేదని చెప్పారు.

తాను లోకేష్‌ను కలిశాననడానికి ఆధారాలు చూపాలని బైరెడ్డి సిద్థార్థ్‌రెడ్డి సవాల్‌ విసిరారు. తానెప్పుడూ జగన్‌కు వీర విధేయుడిగానే ఉంటానని తేల్చిచెప్పారు. ఇప్పటికైనా తనపై చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆపాలని కోరారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News