ఇకపై 24 వారాల గర్బాన్ని తొలగించుకోవచ్చు!

Update: 2020-01-29 14:02 GMT
అన్ వాంటెడ్ ప్రెగ్నెన్సీ వస్తే... 20 వారాల్లోగానే గర్భ స్రావం చేయించుకోవాలి. ఇదీ ఇప్పటిదాకా అమలవుతున్న నిబంధన. అయితే దీనిపై సుధీర్ఘంగా ఆలోచన చేసిన కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు గర్భ విచ్ఛిత్తికి మరింత సమయాన్ని పొడిగించింది. ఈ మేరకు మెడికల్ టెర్మినేషన్ ఆప్ ప్రెగ్నెన్సీ యాక్ట్-1971ను కేంద్ర ప్రభుత్వం సవరించింది. బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ఈ సవరణకు ఆమోదం తెలిపింది. త్వరలోనే ఈ బిల్లును పార్లమెంటులో పెట్టి చట్టంగా మార్చనున్నట్లుగా కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ బుధవారం తెలిపారు. అయినా గర్బ విచ్ఛిత్తికి మరింత సమయం పొడిగిస్తూ కేంద్రం ఎందుకు నిర్ణయం తీసుకుందన్న విషయంపై భిన్న వాదనలు వినిపిస్తున్నా... మంచి ఉద్దేశ్యంతోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందన్న వాదనలే బలంగా వినిపిస్తున్నాయి.

అత్యాచారాలకు గురవుతున్న బాలికలు - యువతులు... ఆ దుశ్చర్య కారణంగా తాము గర్బం దాల్చిన విషయాన్నే గమనించలేకపోతున్నారు. ఈ క్రమంలో గర్భ విచ్ఛిత్తి పరిమితి ముగిసిన తర్వాత అత్యాచారం కారణంగా గర్బం దాల్చినట్లు బాధితులకు తెలిసినా... గర్భాన్ని తొలగించుకోలేకపోతున్నారు. వెరసి.. .చేయని నేరానికి పిల్లలను కని, వారి ఆలనాపాలనపై అంతగా దృష్టి సారించలేక సతమతమవుతున్నారు. ఈ తరహా విపరిణామాలకు పరిష్కారం చూపేపందుకే గర్బ విచ్ఛిత్తి గడువును 20 వారాల నుంచి 24 వారాలకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుందన్న వాదన వినిపిస్తోంది.

అంతేకాకుండా 20 వారాల్లోపే గర్భ విచ్ఛిత్తి చేయాల్సిన పరిస్థితుల్లో ఆపరేషన్ల సమయంలో పలు సమస్యలు తలెత్తుతున్నాయి. శస్త్రచికిత్స కూడా కష్టంగానే మారుతోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో గర్భ విచ్ఛిత్తికి విధించిన 20 వారాల గడువును మరింతగా పెంచితే... శస్త్రచికిత్సలను విజయవంతంగా - రోగికి ఇబ్బంది లేని రీతిలో నిర్వహించే వీలుందన్న వాదనలు కూడా లేకపోలేదు. ఈ మొత్తం వాదనలను సుదీర్ఘ కాలంగా పరిశీలిస్తూ వచ్చిన కేంద్రం... ఎట్టకేలకు గర్భవిచ్ఛిత్తి కాల పరిమితిని 20 వారాల నుంచి 24 వారాలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
Tags:    

Similar News