రోజాకు కేబినెట్ బెర్త్ ఖ‌రారైందా? వైసీపీ వ‌ర్గాల్లో గుస‌గుస‌

Update: 2021-07-18 01:30 GMT
వైసీపీలో కీల‌క నేత‌లుగా ఉన్న అగ్ర‌వ‌ర్ణ నాయ‌కుల‌కు జ‌గ‌న్ కేబినెట్‌లో ప‌ద‌వులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్న‌ట్టు తెలుస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. చిత్తూరు జిల్లా న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకున్న ఫైర్ బ్రాండ్ నాయ‌కురాలు.. జ‌బ‌ర్ద‌స్త్ రోజా ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఇండ‌స్ట్రియ‌ల్ ఇన్‌ఫ్ట్రాస్ట్ర‌క్చ‌ర్ కార్పొరేష‌న్ చైర్మ‌న్‌గా ఉన్నారు.

2019 ఎన్నిక‌ల అనంత‌రం.. జ‌గ‌న్ కేబినెట్ ఏర్పాటు చేసిన స‌మ‌యంలోనే రోజాకు మంత్రి ప‌ద‌వి ద‌క్కుతుంద‌నే ప్ర‌చారం జోరుగా సాగింది. అయితే.. అప్ప‌ట్లో రెడ్డి సామాజిక వ‌ర్గానికి త‌క్కువ ప్రాధాన్యం ఇచ్చిన జ‌గ‌న్.. కొంద‌రికి మాత్ర‌మే అవ‌కాశం ఇచ్చారు.

దీంతో రోజా అల‌క‌పాన్పు ఎక్క‌డం గ‌మ‌నార్హం. కేబినెట్‌లో మంత్రులుగా ప్ర‌మాణ స్వీకారం జ‌రిగిన రోజు.. ఆమె క‌నీసం తాడేప‌ల్లి చుట్టుప‌క్క‌ల కూడా క‌నిపించ‌లేదు. దీంతో ఆమె త‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌లేద‌ని అలిగార‌నే ప్ర‌చారం సోష‌ల్ మీడియాలో జోరుగా సాగింది. ఈ క్ర‌మంలోనే కొన్నాళ్ల‌కు ఆమెను స్వ‌యంగా తాడేప‌ల్లికి ఆహ్వానించిన జ‌గ‌న్‌..ఏపీఐఐసీ చైర్‌ప‌ర్స‌న్ ప‌ద‌విని అప్ప‌గించారు.

దీంతో ఒకింత శాంతించినా.. ఇటీవ‌ల కాలంలో మాత్రం మంత్రిపీఠం ద‌క్కించుకునేందుకు రోజా చాలానే శ్ర‌మిస్తున్నారు. ఒక‌వైపు నియోజ‌క‌వ‌ర్గంలో ఉంటూనే.. మ‌రోవైపు.. వైసీపీ త‌ర‌పున గ‌ళం విప్పుతున్నారు.

ఇటీవ‌ల జ‌రిగిన స్థానిక ఎన్నిక‌ల్లోనూ రోజా.. న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ జెండా ఎగిరేలా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించారు. అదేస‌మ‌యంలో రెండు తెలుగు రాష్ట్రాల మ‌ద్య నెల‌కొన్న జ‌ల వివాదాల‌కు సంబంధించి.. ఎవ‌రూ నోరు విప్పేందుకు సాహ‌సించ‌లేదు. కానీ, రోజా మాత్రం గ‌ళం వినిపించారు. కేసీఆర్‌ను నేరుగా విమ‌ర్శించ‌కుండానే.. ఘాటు వ్యాఖ్య‌ల‌తో మీడియా ముందుకు వ‌చ్చారు.

ఇలా ఇటు పార్టీ త‌ర‌ఫున గ‌ళం వినిపిస్తున్న రోజాకు ఈద‌ఫా న్యాయం జ‌రుగుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రో కొద్ది నెల‌ల్లోనే జ‌ర‌గ‌బోయే మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో ఆమెకు బెర్త్ ఖాయ‌మైంద‌ని..అందుకే ఏపీఐఐసీ చైర్ ప‌ర్స‌న్ ప‌ద‌వి నుంచి ఆమెను త‌ప్పించార‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. ఇదే జ‌రిగితే.. ఆమె ఆశ‌లు ఫ‌లించిన‌ట్టేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.
Tags:    

Similar News