‘నీట్’ తుపాను తీరం దాటింది

Update: 2016-05-20 07:51 GMT
 నీట్‌ పరీక్షను ఏడాదిపాటు వాయిదా వేస్తూ కేంద్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం ఆర్డినెన్స్‌ జారీ చేసింది. నీట్‌ వాయిదా ఆర్డినెన్స్‌ కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తులను దృష్టిలో పెట్టుకుని కేంద్రం నీట్‌ పై ఆర్డినెన్స్‌ ను జారీ చేయడంతో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నట్లయింది. నేష‌న‌ల్ ఎలిజిబిలిటీ కం ఎంట్ర‌న్స్ టెస్ట్‌(నీట్‌)  వాయిదా కోసం  రాష్ట్రాల నుంచి వ‌చ్చిన అభ్యంత‌రాల‌తో కేంద్రం ప్ర‌భుత్వం త‌లొగ్గింది. మెడిక‌ల్ కోర్సుల్లో ప్ర‌వేశాల కోసం సుప్రీం ఆదేశాల మేర‌కు దేశ వ్యాప్తంగా నిర్వ‌హించ త‌ల‌పెట్టిన‌ నీట్ ను ఏడాది పాటు వాయిదా వేస్తూ ఆర్డినెన్స్‌ ను జారీ చేసింది. రాష్ట్రాల అభ్యంత‌రాల‌పై ఢిల్లీలోని ప్ర‌ధాని కార్యాల‌యంలో చ‌ర్చించిన‌ కేంద్ర మంత్రి వ‌ర్గం చివ‌ర‌కు కీల‌క నిర్ణ‌యాన్ని తీసుకుంది. నీట్‌ ను వ‌చ్చే ఏడాదికి వాయిదావేయాలని, అలాగే ప్రాంతీయ భాష‌ల్లో నిర్వ‌హించాల‌ని ప‌లు రాష్ట్రాలు తీవ్రస్థాయిలో అభ్యంత‌రాలు వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే.

కేంద్రం ఆర్డినెన్సు నేపథ్యంలో  తెలంగాణలో ఎంబిబిఎస్‌ - బిడిఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎంసెట్‌ పరీక్షను నిర్వహించడానికి మార్గం సుగమమైంది. రెండు మూడు రోజుల్లో ఎంసెట్‌ పరీక్ష నిర్వహించే తేదీలను ప్రకటించే అవకాశాలున్నాయి. అయితే.. ఆర్డినెన్సు వివరాలు ఇంకా పూర్తిగా తమకు అందలేదు కాబట్టి  ప‌రిశీలించి, త‌దుప‌రి నిర్ణ‌యం చెబుతామని తెలంగాణ వైద్య - ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి ప్రకటించారు.  తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి కూడా ఇదే మాట చెప్పారు. కేంద్రం నీట్‌ పై జారీ చేసిన‌ ఆర్డినెన్స్ ను ప‌రిశీలిస్తామ‌ని, తెలంగాణలో మెడిక‌ల్ కోర్సుల్లో ప్ర‌వేశాల‌కోసం మళ్లీ ఎంసెట్‌ ను నిర్వ‌హించే నిర్ణ‌యంపై త్వ‌ర‌లోనే నిర్ణ‌యాన్ని వెల్ల‌డిస్తామ‌న్నారు.

ఏపీ విషయానికొస్తే నీట్‌ పరీక్ష వాయిదా వేయించడానికి ఎంతో కృషి చేసినట్లు మంత్రి కామినేని శ్రీనివాస్‌ చెప్పుకొచ్చారు.  కేంద్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు చెబుతూనే కేంద్రంపై ఒత్తిడి తేవడంలో తాను ముందున్నానన్నట్లుగా మాట్లాడారు. ఇది ఎంతోమంది తల్లిదండ్రులకు శుభవార్త అని చెప్పిన ఆయన విద్యార్థులకు ఇది ఉపశమనం అన్నారు. కాగా మ‌రోవైపు నీట్ వాయిదా వేయ‌డాన్ని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తీవ్రంగా వ్యతిరేకించారు.
Tags:    

Similar News