15 మంది కొత్త‌వారికే ఛాన్స్‌.. కేబినెట్‌పై క్లారిటీ!

Update: 2022-04-10 09:30 GMT
ఏపీలోని జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో కొత్త‌ కేబినెట్ పై సాగుతున్న సందిగ్ధ‌త‌కు తెర‌ప‌డింది. కొత్త మంత్రి వ‌ర్గంలో ఎవ‌రెవ‌రు ఉంటారు?  ఎంత‌మంది కొత్త‌వారికి అవ‌కాశం.. ద‌క్కుతుంది?  ఎంత మంది పాత‌వారిని తీసుకుంటారు? అనే విష‌యాల‌పై క్లారిటీ వ‌చ్చింది. సీఎం జ‌గ‌న్ 2.0 టీంలో 15 మంది కొత్తవారు రాబోతున్నారు. రాజీనామా చేసిన‌వారిలో 10 మంది సీనియ‌ర్ల‌ను తిరిగి తీసుకుంటున్నార‌ని.. తాడే ప‌ల్లి వ‌ర్గాల నుంచి స‌మాచారం వ‌చ్చింది.

ఆయా జిల్లాల అవసరాలు, సామాజిక కూర్పు, అనుభవం ఆధారంగా ఈ మార్పు..చేర్పులు చేసిన‌ట్టు తెలుస్తోంది. ఇప్పటిదాకా రాష్ట్ర కేబినెట్లో అగ్రవర్ణాలకు చెందిన వారు 44 శాతం ఉండగా.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన వారే మెజారిటీ సంఖ్యలో 56 శాతంగా ఉన్నారు.  తాజా పునర్వ్యవస్థీక రణలో బలహీనవర్గాల శాతం మరింతగా పెంచుతున్న‌ట్టు తాడేప‌ల్లి వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ ద‌ఫా కూడా జ‌గ‌న్ త‌న మంత్రి వ‌ర్గంలో బలహీనవర్గాలకు ముఖ్యంగా బీసీల‌కు పెద్ద పీట వేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది.

ఈ ద‌ఫా సుమారు 60 మంది బీసీ, ఎస్టీ, ఎస్సీల‌కు ప్రాధాన్యం ఉంటుంద‌ని తాడేప‌ల్లి వ‌ర్గాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. అంతేకాదు.. కుదిరితే.. ఇపుడు ఆ సంఖ్యను మరింత పెంచబోతున్నారు.  ఇప్పటిదాకా ఉన్నవారు 10 మంది కొనసాగుతారని, కొత్తగా 15 మంది చేరుతారని కూడా ఆ వర్గాలు వెల్లడించాయి. వారందరికీ  ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్‌ చేసి సమాచారమిస్తార‌ని తెలిసింది.

ప్రమాణ స్వీకార కార్యక్రమం  కోసం వెలగపూడి తాత్కాలిక సచివాలయం ఒకటో బ్లాక్‌ పక్కన ఉన్న ఖాళీ ప్రదేశంలో వేదికను సిద్ధం చేశారు. సోమవారం ఉదయం 11.31 గంటలకు కొత్త మంత్రులతో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రమాణం చేయిస్తారు. కాగా 2019 జూన్‌ 8న కూడా మంత్రులు ఇదే ప్రదేశంలో ప్రమాణ స్వీకారం చేయటం గమనార్హం.

కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార ఏర్పాట్లను వివిధ శాఖలకు విధులను అప్పగిస్తూ జీఏడీ (రాజకీయ) కార్యదర్శి రేవు ముత్యాలరాజు ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రుల ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలను కూడా సాధారణ పరిపాలన (ప్రోటోకాల్‌) విభాగం ఇప్పటికే సిద్ధం చేసింది. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం పూర్తయ్యాక కొత్త, పాత మంత్రులు, అతిధులకు మధ్యాహ్నాం 1 గంటకు సచివాలయంలో తేనేటీ విందు (హైటీ) ఏర్పాటు చేశారు. 
Tags:    

Similar News