కొత్త మంత్రుల పవర్ కి కత్తెర...?

Update: 2022-04-14 13:32 GMT
హాయిగా కొత్త మంత్రులు అయ్యారు. చాలా టెన్షన్ పడ్డారు. ఎన్నో కొండలు ఎక్కారు, ఎందరో దేవుళ్లకు మొక్కారు. మొత్తానికి ఏదైనేనేమి జగన్ వాళ్ళ మీద తన ప్రేమాభిమానాలను చాటుకున్నారు. మంత్రులుగా చేశారు. దాంతో ఒక్కొక్కరుగా తమ బాధ్యతలను స్వీకరిస్తున్నారు. రెండేళ్ల పాటు తామే అన్నీ అన్నట్లుగా వారు భావిస్తున్నారు.

అయితే మాజీ మంత్రులు చాలా మంది మిగిలారు. ఆ నంబర్ 14గా ఉంది. వారికి  పార్టీ పనులతో పాటు క్యాబినేట్ ర్యాంక్ పదవులు ఇచ్చి దర్జా తగ్గకుండా చూస్తామని జగన్ నాడు హామీ ఇచ్చారు. ఇపుడు ఇదే పని మీద వైసీపీ అధినాయకత్వం బిజీగా ఉందని తెలుస్తోంది. మరి కొత్తగా చేయబోయే ఈ ప్రయోగం ఎలా ఉంటుంది అంటే ఏపీలో ఉన్న 26 జిల్లాలకు సంబంధించి కొత్తగా ఇరవై ఆరు జిల్లా అభివృద్ధి మండల్లను ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది.

వీటికి చైర్మన్లుగా మాజీ మంత్రులతో పాటు జిల్లాలో మంత్రి పదవులకు ఆశపడి దక్కని వారితో భర్తీ చేయాలనుకుంటున్నారుట. ఇక జిల్లాలలో ఇప్పటిదాకా జిల్లా ప్రణాళికా కమిటీలు, జిల్లా అభివృద్ధి సమీక్షా కమిటీలు ఉండేవి. వాటికి జిల్లా ఇంచార్జి మంత్రులు ఉండేవారు. జిల్లాలో ఏ చిన్న పని జరగాలన్నా ఇంచార్జి మంత్రుల సంతకం ఉండాల్సిందే. అదే పవర్ మరి.

అలాంటి పవర్ ఫుల్ రోల్ ఇంచార్జి మంత్రులు ప్లే చేసేవారు. ఇపుడు ఇంచార్జి మంత్రులు వ్యవస్థను రద్దు చేస్తారు అని చెబుతున్నారు. అలాగే,   జిల్లా ప్రణాళిక కమిటీలు, అభివృద్ధి సమీక్షా కమిటీల స్థానంలో  అభివృద్ధి మండళ్ళను ఏర్పాటు చేస్తారు అని తెలుస్తోంది. వీటికి చైర్మన్లుగా మాజీ మంత్రులను, ఆశావహులను నియమించి వారికి క్యాబినేట్ మంత్రి ర్యాంక్ ఇవ్వాలని చూస్తున్నారుట. ఇంచార్జి మంత్రుల హోదా అన్న మాట.

అయితే ఈ కొత్త పదవుల సృష్టి వరకూ బాగున్నా ఈ సెటప్ ద్వారా అధికారాలు కొత్త వ్యవస్థకు పోతే కొత్త మంత్రులు డమ్మీలు అవుతారా అన్న చర్చ కూడా ఉంది. మంత్రుల అధికారాలకు కోత పడితే వారు కుర్చీ ఎక్కి ప్రయోజనం ఏంటి అన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది. అయితే వారికీ వీరికీ అధికారాలలను బ్యాలన్స్  చేస్తూ అందరూ కలసి ఉండేలా ఒక వేదికగా దీన్ని ముందుకు తీసుకురాబోతున్నారు అని అంటున్నారు.

అయితే ఇలాంటి అభివృద్ధి మండలి కనుక ఏర్పడి చైర్మన్లుగా మాజీ మంత్రులు నియమితులైతే వారు కొత్త మంత్రులను కాదనే ముందుకు వెళ్తారు. అపుడు రెండు అధికార కేంద్రాలు ఏర్పాటు అవుతాయి. ఇక రాజ్యాంగం ప్రకారం చూస్తే మంత్రులకు సమాంతరంగా వేరే అధికార కేంద్రాలు ఉండవచ్చా అన్న చర్చ ఎటూ ఉంది.

దాంతో వైసీపీ పెద్దలు చేస్తున్న ఈ కసరత్తు, కొత్త ప్రయోగాలు ఎంతవరకూ ఆచరణలో సక్సెస్ అవుతాయి అన్నది చూడాలి. ఏది ఏమైనా ఆశావహులకు అవకాశాలు ఇవ్వాలీ అంటే వారిని ఉత్సవ విగ్రహాలుగా చేయకూడదు, అలాగే మాజీ మంత్రులకు తగిన ప్రాధ్యాన్యత ఇవ్వాలి. అలా వారికి ఇస్తే ఇపుడు మంత్రుల పవర్ కి కత్తెర పడడం ఖాయం. మరి దీన్ని  ఎలా అధిగమిస్తారు అన్నదే చూడాలి.
Tags:    

Similar News