జక్కంపూడి రాజాకి ఆ మంత్రి పదవా..?

Update: 2019-05-27 15:23 GMT
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితులుగా మెలిగిన వారిలో ఒకరు జక్కంపూడి రామ్మోహన్ రావు. వైఎస్ కు నమ్మిన బంటుల లెక్క తీస్తే టాప్ ఫైవ్ లో రామ్మోహన్ రావుకు చోటు లభిస్తూ ఉంది అని పరిశీలకులు అంటారు. అలాంటాయన అనారోగ్యంతో మరణించారు. ఆయన మరణానంతరం ఆయన భార్య, తనయుడు జగన్ వెంట నడిచారు.  

జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టుకున్నాకా కూడా జగన్ నే అనుసరించారు జక్కంపూడి రామ్మోహన్ రావు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు అయిన తర్వాత కొంతకాలానికి ఆయన మరణించారు. ఆ తర్వాత జక్కంపూడి భార్య, పిల్లలు జగన్ వెంట నిలిచారు.

ఈ ఎన్నికల్లో కూడా జక్కంపూడి రాజాకి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాలా సహకారం అందించినట్టుగా తెలుస్తోంది. ప్రత్యేకించి 'ఆర్థిక' వ్యవహారాల్లో జక్కంపూడి రాజాకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాగా అండగా నిలిచాడని అంటారు. చాలా సంవత్సరాల నుంచి పదవులు ఏవీ లేవు జక్కంపూడి కుటుంబానికి. అలాంటి నేపథ్యంలో వారు ఎన్నికల వ్యయప్రయాసలకు కూడా ఇబ్బంది పడుతూ ఉండగా.. జగన్ మోహన్ రెడ్డి పుష్ ఇచ్చారని ఎన్నికల ముందే ఒక ప్రచారం సాగింది.

ఈ ఎన్నికల్లో జగన్ గాలిలో గెలిచిన వారిలో రాజా కూడా ఒకరు. రాజానగరం నుంచి ఈయన నెగ్గారు. గత సాన్నిహిత్యాలు, వీరు జగన్ వెంట ఆది నుంచి ఉన్న నేపథ్యంలో వీరికి మంత్రి పదవి ఖాయమనే ప్రచారం సాగుతూ  ఉందిప్పుడు. రాజాకు జగన్ మంత్రి పదవి ఇస్తారని, అందులోనూ శాఖ కూడా కన్పర్మ్ అయ్యిందని వార్తలు వస్తున్నాయి.

గతంలో జక్కంపూడి రామ్మోహన్  రావు రోడ్లూ భవనాల శాఖ మంత్రిగా వ్యవహరించారు. ఇప్పుడు ఆయన  తనయుడికి కూడా అదే  పదవే దక్కబోతోందని ఒక ప్రచారం సాగుతూ ఉంది. అసలు విషయం ఏమిటనేది త్వరలోనే తెలిసిపోయే అవకాశం ఉంది.
Tags:    

Similar News