ఇద్దరు మంత్రులు ఔట్.. 4 మంత్రులు ఇన్?

Update: 2020-06-24 08:10 GMT
జగన్ కేబినెట్ లో మళ్లీ ఆశలు చిగురించాయి.  ఏపీ నుంచి రాజ్యసభకు ఇద్దరు మంత్రులు తరలిపోవడంతో ఆ రెండు సీట్లు ఖాళీ అయ్యాయి.  పిల్లి సుభాష్ చంద్రబోస్ - మోపిదేవి వెంకటరమణ - రాజ్యసభ సభ్యులుగా పోనున్నారు.   మోపిదేవి - పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ లు జగన్ కేబినెట్‌ లో మంత్రులుగా ఉండటంతో.. వీరిద్దరూ రాజ్యసభకు వెళ్లిపోతే రెండు పదవులు ఖాళీ అవుతాయి. దీంతో జగన్ కేబినెట్‌ లో మార్పులు చేర్పులు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

త్వరలోనే మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.. ఒకవేళ అదే జరిగితే ఈ ఇద్దరి స్థానంలో ఎవరెవరికి అవకాశం దొరుకుతుందోననే చర్చ మొదలైంది. కేబినెట్ రేసులో చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి.. రోజుకొకరి పేరు వినిపిస్తోంది.  అయితే పిల్లి సుభాష్ - మోపిదేవి ఇద్దరూ బీసీ సామాజికవర్గానికి చెందిన వాళ్లు.. జగన్ మాత్రం 2.5 సంవత్సరాల తర్వాతనే కేబినెట్ పునర్వ్యస్థీకరిస్తానని మొదట్లో ప్రకటించారు. ఇప్పుడు రెండు సీట్లు ఖాళీ కావడంతో అవి భర్తీ చేయడంతోపాటు మరో ఇద్దరు పనిచేయని మంత్రులకు స్వస్తి పలికాలని జగన్ నిర్ణయించినట్టు ప్రచారం జరుగుతోంది.  త్వరలోనే నలుగురు కొత్త మంత్రులు జగన్ కేబినెట్ లోకి వస్తారని అంటున్నారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ తోపాటు గుంటూరు జిల్లాకు చెందిన మంత్రి మోపిదేవి స్థానంలో ఎవరికి పదవి వస్తుందోనన్న చర్చ మొదలైంది. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేతో పాటూ తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్యేల పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ ముగ్గురిలో ఒకరికి మంత్రి పదవి ఖాయమనే చర్చ జరుగుతోంది.

ఎన్నికల ఫలితాల తర్వాత రోజాకు మంత్రి పదవి ఖాయమనే ప్రచారం జరిగింది. కానీ తీరా జగన్ మాత్రం సామాజిక సమీకరణాలతో ఆమెకు అవకాశం కల్పించలేదు. దీంతో ఆమె ఒకింత అసహనానికి గురయ్యారు.. వెంటనే రంగంలోకి దిగిన పార్టీ పెద్దలు సర్థిచెప్పడంతో.. తర్వాత ఆమె ముఖ్యమంత్రి జగన్‌ను కలిశాక కాస్త మెత్తబడ్డారు. కొద్ది రోజులకు ఏపీఐఐసీ ఛైర్మన్‌ పదవిని అప్పగించారు. మళ్లీ పార్టీలో యాక్టివ్ అయ్యారు.. అసెంబ్లీ సమావేశాల్లో కూడా ప్రతిపక్షాన్ని బాగా కార్నర్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ దగ్గర మంచి మార్కులే కొట్టేశారు.. అంతేకాదు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో తనకు మంత్రి పదవిపై ఆశలు ఉన్నాయని పరోక్షంగా చెప్పారు. ఇప్పుడు శాసనమండలి రద్దు కావడంతో ఆమె మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఈసారైనా జగన్ రోజాను కరుణిస్తారా లేదా అన్నది చూడాలి.

గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలు మాత్రమే కాదు.. మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, కొలుసు పార్ధసారథి.. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అంబటి రాంబాబుతో పాటూ మరికొందరు నేతలు ఆశలు పెట్టుకున్నారు. అంతేకాదు స్పీకర్ తమ్మినేని సీతారాంను కేబినెట్‌లోకి తీసుకునే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. మరి వైఎస్ జగన్ కేబినెట్ విస్తరణకు ఎలాంటి స్ట్రాటజీతో వెళతారన్నది ఆసక్తికరంగా మారింది. సామాజిక సమీకరణాలతో పాటూ జిల్లాలవారీగా లెక్కలు బేరీజు వేసుకుంటారా.. గతంలో పదవి ఆశించినవారికి అవకాశం కల్పిస్తారా అన్నది చూడాలి. అంతేకాదు రెండున్నరేళ్లు కొందరికి.. మరో రెండున్నరేళ్లు మరికొందరికి అవకాశం కల్పిస్తామని జగన్ సంకేతాలు ఇచ్చారు. అదే పద్దతిని అనుసరిస్తారా అన్నది సస్పెన్స్‌గా మారింది.

గుంటూరు జిల్లాకే చెందిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారట.  కేబినెట్ బెర్త్‌పై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా ఆశలు పెట్టుకున్నారు. 2019 ఎన్నికల ప్రచారంలో స్వయంగా వైఎస్ జగన్ ఆర్కేకు మంత్రి పదవి ఇస్తానని ప్రకటించారు. కానీ ఆయనకు సామాజిక సమీకరణాలతో పదవి దక్కలేదు.. 

మొత్తంగా పిల్లి సుభాష్ - మోపీదేవితోపాటు మరో ఇద్దరకు ఉద్వాసన పలికి మరో నలుగురు కొత్త మంత్రులకు జగన్ అవకాశం కల్పిస్తారనే ప్రచారం వైసీపీ వర్గాల్లో సాగుతోంది. మరి అది నిజమవుతుందా లేదా అన్నది వేచిచూడాలి.
Tags:    

Similar News