పరిషత్ వార్: క్యాంప్ రాజకీయాలతో కాక

Update: 2021-09-24 09:30 GMT
ఏపీలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైసీపీ జోరు కొనసాగింది. అయితే కొన్ని చోట్ల నేతల మధ్య విభేదాలు తలెత్తడంతో ఎంపీపీ ఎన్నికలో వివాదం రాజుకుంది. సొంత పార్టీలోనే రెండు వర్గాలుగా ఏర్పడడంతో ఎంపీపీ పదవి ఎవరికి దక్కుతుందోనని పార్టీ శ్రేణులు అయోమయానికి గురవుతున్నారు. పార్టీపై ఆధిపత్యం కోసం కొందరు ఎంపీటీసీలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుండగా.. మరోవైపు తమ నాయకత్వాన్నే ధిక్కరిస్తావా..? అంటూ ఇద్దరు నేతల మధ్య పోరు భగ్గుమంది. దీంతో శ్రీకాకులం జిల్లాలో ఎంపీపీ ఎన్నికపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

ఉత్తరాంధ్రలో కీలకంగా ఉన్న శ్రీకాకుళం జిల్లాలో రాజకీయాలు ఎప్పుడూ వేడిగానే ఉంటాయి. ఆయా పార్టీల్లో ఉన్న నాయకులు తమ పట్టు కోసం నిత్యం పోరాటం చేయడంతో ఆధిపత్య పోరు సాగుతూనే ఉంటుంది. అధికార వైసీపీ విషయానికొస్తే ఇద్దరు ప్రధాన నేతల మధ్య విభేదం తారాస్థాయికి చేరుకుంది. ఇరువురి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి వెళ్లింది. అంతేకాకుండా సొంత పార్టీలోని నాయకులే రెండు వర్గాలుగా ఏర్పడి ఒకరిపై ఒకరు దాడి చేసుకునే స్థాయికి వెళ్లింది. అయితే ఈ విషయం అధిష్టానం వద్దకు చేరిందా..? లేదా..? అన్నది పక్కనబెడితే లోకల్ నాయకులు మాత్రం అయోమయానికి గురవుతున్నారు.

శ్రీకాకుళం జిల్లాలో మొదటి నుంచి పార్టీలో కొనసాగుతున్న దువ్వాడ శ్రీనివాస్ కు ఎమ్మెల్సీ పదవి వరించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన జిల్లాపై పట్టు సాధించేందుకు నిత్యం పార్టీ కార్యకలాపాలను చక్కదిద్దేందుకు యత్నిస్తుంటారు. మరోవైపు కళింగ కార్పొరేషన్ చైర్మన్ పేరాడ తిలక్ సైతం తన ఆధిపత్యం కోసం పరితపిస్తున్నారు. ఇటీవల నందిగామ మండలంలో 16 ఎంపీటీసీ స్థానాలు వైసీపీ వశం అయ్యాయి. ఇవన్నీ తిలక్ ఆధ్వర్యంలోనే విజయం సాధించాయి. ఇక టెక్కలి నియోజకవర్గంగా పేరాడ తిలక్ ఉండడంతో ఆయన సూచించిన ఓ వ్యక్తికి ఎంపీపీ పదవి ఇవ్వాలని ప్రతిపాదన పెట్టారు.

అయితే ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్ మాత్రం తాను సూచించిన వ్యక్తికే ఎంపీపీ పదవి ఇవ్వాలన్నారు. దీంతో తిలక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన 16 మంది ఎంపీటీసీలను క్యాంప్ నకు తరలించారు.తిలక్ చేసిన పనికి దువ్వాడ శ్రీనివాస్ కోపం తెప్పించింది. పార్టీ విప్ ధిక్కరిస్తే తిలక్ తో పాటు 16 మంది ఎంపీటీసీలను సస్పెండ్ చేస్తానని హెచ్చరించాడు. ఇందుకు సంబందించిన ఓ వీడియోను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్ వార్నింగ్ కు తిలక్ ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. అయితే దువ్వాడ ఎమ్మెల్సీ అయినందుకు ఆయన సూచించిన వ్యక్తికే ఎంపీపీ పదవి ఇవ్వాలని ఆయన అనుచరులు అంటున్నారు. అయితే కింది స్థాయి నాయకులు మాత్రం ఎవరికి వర్తిస్తుందోనన్న ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.

ఎంపీపీ పదవిపై టెక్కలిలోనే కాకుండా పెదకూరుపాడులోనూ వివాదం ఏర్పడింది. గుంటూరు జిల్లాలోని పెదకూరుపాడు మండలంలో 14 ఎంపీటీసీ స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది. అయితే ఎంపీపీ పదవిపై ఎవరికి వారే మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేతల మధ్య రాజీ అస్సలు కుదరడం లేదు. దీంతో ఇటీవల నిర్వహించిన సమావేశానికి ఎంపీటీసీలంతా హాజరు కాలేదు. అధికారులు ఆ ఎంపీపీ ఎన్నికను వాయిదా వేశారు.

ఇలా ఎంపీపీ పదవిపై నేతలు, ఆశావహులు తమదైన శైలిలో రాజకీయాలు చేస్తున్నారు. కొందరు ఆధిపత్యం కోసం ప్రయత్నాలు చేస్తుండగా.. మరికొందరు మండలంలో అత్యున్నత పదవిని దక్కించుకునేందుకు రాజకీయ వ్యూహాలు రచిస్తున్నారు. ఇక కొందరు ఎమ్మెల్యేలను సంప్రదించి పదవి దక్కేలా ఆరాటపడుతున్నారు. అయితే ఇలాంటి వివాదాస్పద స్థానాల్లో అధిష్టానం ఎలాంటి పరిష్కారం వెతుకుతుందోనని పార్టీ శ్రేణులు ఎదురుచూస్తున్నారు.


Tags:    

Similar News