కిమ్ కు అతీత శక్తులు..ఇదిగో ఆధారం

Update: 2017-12-14 04:08 GMT
కిమ్‌ జాంగ్‌ ఉన్‌. ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరిది. నార్త్ కొరియా ప్రెసిడెంట్‌గా కంటే ఓ నియంతగానే అందరికి సుపరిచితుడు. తన దూకుడు స్వభావంతో నిత్యం వార్తల్లో నిలుస్తాంటారీయన. గత రెండు - మూడేళ్లుగా ప్రపంచ మీడియాను తనవైపు తిప్పుకున్న కిమ్‌పై.. రోజుకొక్క ఆసక్తికర విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా.. ఉత్తర కొరియా అధికార మీడియా కిమ్‌ పై రాసిన కథనం.. ఆసక్తిని కల్గిస్తోంది. కిమ్‌ జాంగ్‌ ఉన్‌ కు సూపర్‌ పవర్స్‌ ఉన్నాయంటూ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది కొరియన్  సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ.

కొద్ది రోజుల కిందట 9వేల అడుగుల ఎత్తున్న మౌంట్‌ పక్తూ పర్వతాన్ని కిమ్‌ అధిరోహించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో హల్ చల్ చేశాయి. పర్వతంపై కిమ్‌ చిరునవ్వులు చిందిస్తున్న ఫోటోలు వైరల్‌ అయ్యాయి. అంత ఎత్తు ఎక్కినా.. అలసి పోయినట్టు కనిపించకపోవడానికి సూపర్ పవర్స్‌ కారణమంటూ కొరియన్‌ మీడియా కథనం రాసింది. మూడేళ్ల వయసులోనే కిమ్‌ కారును నడిపారని - 9 ఏళ్లకు సెయిలర్‌ గా పోటీ పడ్డారని తెల్పింది.

ఈ క‌థ‌నంలో మ‌రెన్నో `అతి` అంశాల‌ను కూడా రాయ‌డం గ‌మ‌నార్హం. వాతావరణ నియంత్రణా శక్తులు సైతం కిమ్‌ కు ఉన్నాయని - ఎండ కావాలని కోరితే ఎండ - వర్షం కావాలంటే క్షణాల్లో వాన కురుస్తుందని కథనంలో రాసుకొచ్చింది అక్కడి మీడియా. కిమ్‌ ఆధ్వర్యంలో నార్త్ కొరియా సైంటిస్టులు ఓ ఔషధాన్ని తయారు చేశారన్న కొరియన్‌ సెంట్రల్‌ న్యూస్ ఏజెన్సీ.. ఎయిడ్స్‌ - ఎబోలా సహా క్యాన్సర్‌ - గుండె జబ్బులు ఆ ఔషధంతో నయం అవుతాయని తెలిపింది.

అయితే స‌హ‌జంగానే ఈ కథనంపై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. హేతువాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారిక మీడియా.. అసత్యాలను ప్రచారం చేయడం దారుణమని మండిపడుతున్నారు. సైన్స్‌ ఇంత అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో ఎలాంటి ఆధారాలు లేని కథనాలను రాయడం దుర్మార్గమని విమర్శిస్తున్నారు. అయితే నార్త్‌ కొరియా అధికారులు కూడా ఈ కథనంపై ఇంతవరకు స్పందించలేదు.
Tags:    

Similar News