పవన్ అంత సాహసం చేస్తాడా?

Update: 2018-05-06 06:51 GMT
కొత్తగా పార్టీ పెట్టిన నాయకుడు ఎన్నికల్లో తనకు సేఫ్ అనిపించే నియోజకవర్గాన్నే ఎంచుకోవాలని చూస్తాడు. పార్టీ అధినేతగా తన ఫలితంలోనే తేడా వస్తే పరువు పోతుంది. అందుకే అన్ని సమీకరణాలూ చూసుకుని గెలిచే నియోజకవర్గాన్ని ఎంచుకుంటాడు. 2009లో మెగాస్టార్ చిరంజీవి కూడా అదే పని చేశాడు. కాపు ఓట్లు భారీగా ఉన్న తన సొంత నియోజకవర్గం పాలకొల్లును.. అలాగే తిరుపతిని ఎంచుకుని ఎన్నికల్లో పోటీ పడ్డాడు. అందరూ పాలకొల్లులో చిరంజీవి గెలుపు ఖాయమని.. తిరుపతి సంగతే అనుమానమని అన్నారు. కానీ విచిత్రంగా చిరు తిరుపతిలో గెలిచాడు. పాలకొల్లులో  ఓడిపోయాడు. ఇది చిరు ఇమేజ్ ను బాగా డ్యామేజ్ చేసింది. కట్ చేస్తే ఇప్పుడు చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ ‘జనసేన’ తరఫున ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ లోని 175 నియోజకవర్గాల్లోనూ జనసేన అభ్యర్థులు బరిలో ఉంటారని పవన్ స్పష్టం చేశాడు.

చిరు లాగే పవన్ కూడా రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసే అవకాశం స్పష్టం. ఆల్రెడీ రాయలసీమలోని అనంతపురం నుంచి తాను పోటీ చేయనున్నట్లు పవన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి ఆంధ్రాలో ఏ నియోజకవర్గాన్ని పవన్ ఎంచుకుంటాడన్నది ఆసక్తికరం. చిరుకు చేదు అనుభవాన్ని మిగిల్చిన పాలకొల్లు నుంచి పవన్ పోటీ చేస్తాడా.. లేక భయపడి వెనక్కి తగ్గుతాడా అన్నది చూడాలి. ఈ నియోజకవర్గంలో పవన్ సామాజిక వర్గం కాపుల ఓట్లు భారీగా ఉన్నాయి. కానీ ఇది తెలుగుదేశం పార్టీకి కంచుకోట అనే చెప్పాలి. తెలుగుదేశం పార్టీ పెట్టాక 1989.. 2009లో మినహాయిస్తే ప్రతిసారీ ఆ పార్టీ అభ్యర్థులే గెలిచారు. 2014లోనూ ఆ పార్టీకి చెందిన నిమ్మలరామానాయుడు గెలిచాడు. ఇప్పుడు ఆయనకు నియోజకవర్గంపై మంచి పట్టుంది. ఈ నేపథ్యంలో పవన్ ఏం చేుస్తాడో చూడాలి. చిరంజీవి 2009లో ఒక మహిళ చేతిలో ఓడిపోయాడు. మెగా ఫ్యామిలీ అంత పెద్ద స్థాయికి ఎదిగినా సొంత ఊరు మొగల్తూరుకు ఏమీ చేయలేదనే భావన అక్కడ జనాల్లో ఉందంటారు. 2009లో వైఎస్ హవా కూడా ఉండటం చిరుకు ప్రతికూలంగా మారింది. మరి ఇప్పుడు పవన్ అన్ని సమీకరణాలన్నీ చూసి ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.
Tags:    

Similar News