మహేష్ బాబును ఫాలో అవుతున్న టీఆర్ఎసోళ్లు!

Update: 2022-10-21 09:42 GMT
'గ్రామాల దత్తత' అనే కాన్సెప్ట్ కు పురుడు పోసింది మహేష్ బాబు. తన శ్రీమంతుడు చిత్రంలో దీన్ని ప్రధాన హైలెట్ గా చూపించి అటు ప్రజల మనసులు గెలవడమే కాదు.. ఆ సినిమాతో కలెక్షన్లు రాబట్టారు. ఆ హిట్ మూవీ ఎంతో మందికి స్ఫూర్తినిచ్చింది. గ్రామాలను బడాబాబులు దత్తత తీసుకోవాలన్న సందేశాన్ని పంపింది.

అయితే ఎన్నికల వేళ శ్రీమంతుడు ఫార్ములానే తమకు అనుకూలంగా ఓట్లు రాబట్టుకునేందుకు.. ప్రచారం కోసం వాడుకుంటున్నారు టీఆర్ఎస్ నేతలు. దత్తత తీసుకొని అభివృద్ధి చేయడం మాట అటుంచితే ప్రస్తుతానికి ఓట్లు రాబట్టుకునేందుకు చోటా మోటా నేతలనుంచి మంత్రుల వరకూ అందరూ 'దత్తత' అంటూ కొత్త పల్లవి అందుకుంటున్నారు.

టీఆర్ఎస్ కీలక నేతలంతా మునుగోడులో 'దత్తత' మంత్రం జపిస్తున్నారు. ఏ ఊరు వెళితే ఆ ఊరును దత్తత తీసుకుంటామని అంటున్నారు. మంత్రి కేటీఆర్ తొలుత టీఆర్ఎస్ ను గెలిపిస్తే మునుగోడును దత్తత తీసుకుంటామని ప్రకటించారు. ఆ తర్వాత ఇప్పుడు నేతలంతా గ్రామాలను దత్తత తీసుకుంటామని ప్రకటిస్తున్నారు.

ప్రస్తుతం మునుగోడులో ప్రతీ మండలాన్ని, గ్రామాలను మంత్రులకు బాధ్యతగా కేసీఆర్ అప్పగించారు. వారు తమకు అప్పగించిన గ్రామాల్లో తిరుగుతూ మెజార్టీ కోసం దత్తత తీసుకుంటామని ప్రజలకు హామీ ఇస్తున్నారు. టీఆర్ఎస్ ను గెలిపించాలని కోరుతున్నారు. తమ నియోజకవర్గాలను అభివృద్ధి చేయలేని మంత్రులు ఇలా మునుగోడులో మాత్రం దత్తత పేరుతో అభివృద్ధి చేస్తామనడాన్ని జనాలు నమ్మడం లేదు.

తాజాగా మంత్రి మల్లారెడ్డి చౌటుప్పల్ మండలం ఆరెగూడెం గ్రామాన్ని దత్తత తీసుకుంటానని ప్రకటించారు. ఎర్రబెల్లి కూడా చండూర్ మున్సిపాలిటీ దత్తత తీసుకుంటునన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ అయితే కేటీఆర్ సీఎం అవుతారని.. ఆయన దత్తత తీసుకున్న మీ నియోజకవర్గాన్ని తాను దగ్గరుండి డెవలప్ చేస్తానని అంటున్నారు.అభివృద్ధి అవకాశాన్ని వదలుకోవద్దని ప్రజలను కోరుతున్నాడు.

టీఆర్ఎస్ దత్తత రాజకీయాలపై బీజేపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. కేటీఆర్ దత్తత తీసుకోవడానికి మునుగోడు ప్రజలు ఏమైనా అనాథలా.. దత్తత పేరుతో వారిని మోసం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేని నేతల దత్తత పేరుతో ఓట్లు రాబట్టుకునే కుట్రకు తెరలేపారని మండిపడుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News