దుర్మార్గం.. ఆరాచకం అనే బదులు ఆధారాలు చూపరేం బాబు?

Update: 2020-08-29 05:45 GMT
ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా నిత్యం ఏదో అంశంపై ఏపీలోని జగన్ సర్కారును బద్నాం చేసే అలవాటున్న మాజీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి జగన్ పై విమర్శలు గుప్పించారు. పాలనలో జగన్ కు అనుభవం లేదన్న మాటను హైలెట్ చేసిన ఆయన.. విజయవాడ లోక్ సభ నియోజకవర్గానికి సంబంధించి పార్టీ రివ్యూ సమావేశాన్ని నిర్వహించారు. సోమవారం రాత్రి నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎప్పటిలానే తనకు అలవాటైన పదాలతో జగన్ సర్కారుపై విమర్శలు.. ఆరోపణలు గుప్పించారు.

పరిపాలనను జగన్మోహన్ రెడ్డి మూడు ముక్కలాటగా మార్చారని.. పాలనా అనుభవం లేదన్న ఆయన.. జగన్ కు క్రైసిస్ మేనేజ్ మెంట్ తెలీదన్నారు. గవర్నెన్స్ అస్సలే చేతకాదన్నారు. స్కామ్ పట్టాగా ఇళ్ల స్థలాల పథకాన్ని చేశారని.. ఇంత పనికిమాలిన ప్రభుత్వాన్ని చరిత్రలో చూడలేదన్నారు. మూర్ఖత్వం.. వితండవాదనతో రాష్ట్రానికి జగన్ తీవ్ర నష్టం వాటిల్లేలా చేస్తున్నారన్న మండిపాటును ప్రదర్శించిన చంద్రబాబు.. మరిన్ని ఆరోపణలు చేశారు.

ఇసుక.. మద్యం.. భూములు.. గనులు.. ఇలా ప్రతి దానిలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కుంభకోణాలకు పాల్పడుతుందన్నారు. కొండలు కొట్టేస్తున్నారని.. అడవుల్ని నరికేస్తున్నారని.. మట్టి.. ఇసుక మింగేస్తున్నట్లుగా మండిపడ్డారు. జగన్ ప్రభుత్వంలో అవినీతి కుంభకోణాలకు హద్దు అదుపు లేకుండా పోయిందని.. ఇలాంటి ఆరాచకపు శక్తిని గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు.

ఏ సీఎం హయాంలోనూ ఇన్ని అఘాయిత్యాలు జరగలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ఇంత అప్రతిష్ట గతంలో ఎప్పుడూ లేదన్న ఆయన.. తన మాటలకు సరైన ఆధారాలు చూపించే విషయాన్ని మర్చిపోవటం గమనార్హం. అధికార పక్షం మీద విపక్షం విమర్శలు చేయటం మామూలే. గంపగుత్తగా.. రొడ్డు కొట్టుడు డైలాగులు వల్లించటం వదిలేసి.. ఏదైనా ఒక అంశాన్ని తీసుకొని.. దాని మీద పోరాడితే బాగుంటుంది.

ప్రతి విషయంలోనూ ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందన్న మాట ప్రజలకు అంతగా ఎక్కడన్న ప్రాథమిక అంశాన్ని అనుభవం ఉన్న చంద్రబాబుకు ఎందుకు అర్థం కావట్లేదు. అనుభవం గురించి తాను మాట్లాడితే ప్రజలు పట్టించుకోరన్న విషయాన్ని టీడీపీ అధినేత గుర్తిస్తే మంచిదని చెబుతున్నారు. ఎప్పుడు వచ్చామన్నది ముఖ్యం కాదు.. బుల్లెట్ దించామా? లేదా? అన్నదే పాయింట్ అన్న డైలాగును మనసు నిండా నింపుకున్న నేటి తరానికి బాబు నోట వచ్చే ‘అనుభవలేమి’ మాటలు నచ్చుతాయంటారా?
Tags:    

Similar News