కల్పన.. ఓ ఇల్లాలే కాదు.. ఆమె ఓ మహాశక్తి..
ప్రతి మగవాడి విజయం వెనుక ఆడవారు ఉంటారని అంటుంటారు. అక్షరాల అది నిజం అని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ విషయంలోనూ రుజువైంది
ప్రతి మగవాడి విజయం వెనుక ఆడవారు ఉంటారని అంటుంటారు. అక్షరాల అది నిజం అని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ విషయంలోనూ రుజువైంది. ఎన్నికల ప్రచారంలో సీఎం హేమంత్ సోరెన్, అతని భార్య కల్పనా సోరెన్‌లను కార్నర్ చేస్తూ ‘బంటీ-బబ్లీ’ అంటూ బీజేపీ వారిపై పలు విమర్శలు చేసింది. కానీ.. వారి మాటలకు చెక్ పెడుతూ తమ సక్సెస్‌ను చాటింది ఈ ఆదర్శ జంట. మరోసారి జార్ఖండ్‌లో విజయం సాధించి తామేంటో బీజేపీకి చూపించారు.
కల్పనా సోరేన్ ముఖ్యమంత్రి భార్య అయినప్పటికీ.. బేసిక్‌గా ఆమె ఓ వ్యాపారవేత్త.. సామాజిక కార్యకర్త. ఇది మొన్నటివరకు ఆమెకు ఉన్న గుర్తింపు. కానీ.. ఇప్పుడు ఆమె ఓ ఎమ్మెల్యే. పార్టీలో ఆమెదే కీ రోల్. అన్నింటికీ మించి భర్తకు మరోసారి సీఎం పీఠాన్ని అందించిన ధీశాలి. ఒక సాధారణ మహిళ నుంచి ఆమె ఓ మహాశక్తి వరకూ ఎదిగిన తీరు అందరికీ ఆదర్శం అని చెప్పాలి. భర్తకు కష్టకాలంలోనూ తోడుగా నిలుస్తూ.. భర్త రాజకీయాల్లో సక్సెస్ సాధించేందుకు ఆమె చేసిన కృషి కూడా వర్ణించలేనిది.
కల్పన స్వస్థలం ఒడిశాలోని మయూర్‌భంజ్ నగరం. పెరిగింది అంతా కూడా రాంచీలోనే. నాన్న అంపా ముర్ము ఆర్మీలో పనిచేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కుటుంబాలతో ఆమె కలిసి పెరిగారు. దీంతో అన్ని సంప్రదాయాల గురించి ఆమెకు అవగాహన ఉంది. ఇంజినీరింగ్ పూర్తయిన వెంటనే పెళ్లయింది. భర్త హేమంత్ సోరేన్ జార్ఖండ్ ముక్తి మోర్చా నాయకుడిగా ఉన్నారు. దీంతో పెళ్లయ్యాక ఆమె కుటుంబానికి ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చారు. బిజినెస్ మేనేజ్‌మెంట్ చేయాలని ఆమె కల కావడంతో.. ప్రెగ్నెన్సీకి ఉన్నప్పటికీ చదివి పట్టా సాధించారు. ప్రసవం అయ్యేలోపు ఎంబీఏ పట్టాను ఆమె పొందారు.
కల్పన తల్లి పెద్దగా చదువుకోలేదు. ఆమెకు గిరిజన భాష తప్పితే హిందీ రాదు. అందుకే కల్పన ప్రతీ మహిళ చదువుకోవాలి.. అప్పుడే అభివృద్ధి సాధ్యం అవుతుందని నమ్మారు. దాంతో గిరిజన అమ్మాయిలకు చదువు చెప్పించేందుకు ఆమె కృషి చేశారు. విద్యాసంస్థలు ప్రారంభించడంతోపాటు అప్పుడే వ్యాపార రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇద్దరు పిల్లలతో హాయిగా ఆనందంగా ఉన్నారు. ఆ ఆనందానిని మరింత రెట్టింపు చేస్తూ హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. అనుకోని పరిస్థితుల్లో మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్ అరెస్ట్ కావాల్సి వచ్చింది. అయినప్పటికీ ఆమెలో ఆత్మవిశ్వాసం దెబ్బతినలేదు. అప్పుడే ఆమె ధైర్యంగా రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ‘నా భర్త జైలుకు వెళ్లినప్పుడు అత్తింటివారు అంతా కూడా కన్నీరు పెట్టుకున్నారు. నేను మాత్రం ధైర్యంగా నిలవాలని అనుకున్నాం. కానీ.. వారిని చూసి నాకూ కన్నీరు ఆగలేదు. ఇప్పుడు మీ ప్రేమాభిమానాల ముందు నేనెంత బలవంతురాలినో అర్థమైంది. కుటుంబ బాధ్యతతోపాటు నా మమ అందించిన పార్టీ బాధ్యతను సవ్యంగా నడిపిస్తా’ అని తన మాటలతో ప్రజలను ఆకట్టుకున్నారు. అంతే.. నెలల వ్యవధిలోనే గాండేయ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఆమె తొలి విజయం సాధించి గ్రేట్ అని నిరూపించుకున్నారు. అందుకే.. కల్పనను అందరూ హేమంత్ భార్య మాత్రమే కాదని, ఆమె ఓ మహిళా శక్తి అని అంటుంటారు.