పేటీఎం క‌రో..ఎన్నిక‌ల ప్ర‌లోభాల్లో కొత్త ట్రెండ్‌

Update: 2018-11-27 05:27 GMT
ఎన్నికలు డబ్బు చుట్టూ తిరగడం మొదలై చాలా కాలమైంది. డబ్బు ప్రాధాన్యం గుర్తించిన ఎన్నికల సంఘం అభ్యర్ధులకు ఓ పరిమితి విధించింది. ఖర్చుదాటకుండా నిఘా కూడా పెట్టింది. ఈ నిఘానీడలను తప్పించుకునేందుకు - ప్రత్యర్ధుల ఫిర్యాదులకు చిక్కకుండా ఉండేందుకు కొందరు అభ్యర్ధులు కొత్తపోకడలు పోతున్నారు.ఇక ఎన్నికల ప్రచారంలో మా వెంట జనం ఉన్నారని చూపించుకోవడానికైనా డబ్బులు వెదజల్లాల్సిన పరిస్థితి. అయితే, ఇప్పుడు స్మార్ట్‌ ఫోన్ల కాలం కావడంతో డబ్బులు పంపిణీ చేస్తే అలా వీడియో తీసి... ఇలా సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. దీంతో అభ్యర్థులు డిజిటల్ పేమెంట్స్‌ పై దృష్టిపెట్టారు. పేటీఎం కరో... అంటూ డిజిటల్ పేమెంట్స్ చేసేస్తున్నారు. ఎన్నికల కమిషన్‌ కు చిక్కకుండా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కొత్త ఎత్తులతో పెయిడ్‌ కార్యకర్తలకు - తమ వెంట నడిచే వారికి నేరుగా స్మార్ట్‌ ఫోన్‌ లోని వ్యాలెట్లు - యాప్‌ ల ద్వారా పేమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ట్రెండ్  ప‌ట్నం నుంచి ప‌ల్లెదాక క‌నిపిస్తోంది.

ఇప్పుడు ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ అందులో పేటీఎం యాప్‌ సర్వసాధారణమైన విషయంగా మారిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఈ వెసులు బాటు ఎన్నిక‌ల బ‌రిలో నిలిచిన వారికి వ‌రంగా మారింది. డబ్బుల పంపిణీకి అదే ఆయుధంగా ప‌లువురు అభ్యర్థులు మార్చుకుంటున్నారు. అసలే ఉరుకుల పరుగుల జీవితంలో నేతల వెనుక తిరిగే కార్యకర్తలు తక్కువైపోతున్నారు. దీంతో పెయిడ్‌ కార్యకర్తలను ఆశ్రయించాల్సిన పరిస్థితి. విద్యార్థులు - యువత - మహిళా సంఘాల సభ్యులు... చివరకు అడ్డా కూలీలను సైతం నేతలు వదలకుండా డబ్బులు ఇచ్చి తమ వెంట తిప్పుకుంటున్నారు. వీరిలో కూలీలను మినహియిస్తే... మిగతా వారికి నేరుగా డబ్బులు ఇవ్వకుండా... అర్దరాత్రి దాటిన తర్వాత పేటీఎం ద్వారా పంపిస్తున్నారు. తమ వెంట వచ్చిన వారి వివరాలు తీసుకుని... వారి పేటీఎం నంబర్‌ సేకరించి... గుట్టు చప్పుడు కాకుండా డబ్బులు పంపిణీ చేస్తున్నారు. ఈ తరహా పేమెంట్లు జంట నగరాల్లో జోరుగా సాగుతున్నట్టు తెలుస్తోంది. దీని కోసం కొంత మంది అభ్యర్థుల దగ్గర ప్రత్యేకంగా కొంత టీమ్ పనిచేయ‌డం కొస‌మెరుపు!



Tags:    

Similar News