గంట మోగ‌క ముందే అభ్య‌ర్థులు రెఢీనా?

Update: 2019-01-26 05:12 GMT
అంచ‌నాల‌కు భిన్నంగా వ్య‌వ‌హ‌రించ‌టం తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు అల‌వాటు. ఎవ‌రూ ఊహించ‌ని ప‌నులు ఆయ‌న చేస్తుంటారు. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లే స‌మ‌యంలో ఆయ‌న తీరు ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. అసెంబ్లీని ర‌ద్దు చేసి ముంద‌స్తుకు వెళ్లాల‌న్న రోజునే.. 90 శాతం మంది అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించి మ‌రీ సంచ‌ల‌నం సృష్టించిన ఆయ‌న అదే త‌ర‌హా సంచ‌ల‌నానికి మ‌రోసారి సిద్ధ‌మ‌య్యారు.

అన్ని అనుకున్న‌ట్లు జ‌రిగితే వ‌చ్చే నెల మూడో వారంలో లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు ఈసీ గంట మోగిస్తుంద‌న్న అంచ‌నాలు వ్య‌క్త‌మ‌వుతున్న వేళ‌.. బ‌రిలోకి దించాల్సిన అభ్య‌ర్థుల‌కు సంబంధించిన క‌స‌ర‌త్తు పూర్తి అయిన‌ట్లుగా చెప్ప‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. ఈసారి ఎన్నిక‌ల్లో హైద‌రాబాద్ మిన‌హా మిగిలిన అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలుపు ల‌క్ష్యంగా కేసీఆర్ ప్లాన్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 17 లోక్ స‌భ స్థానాలు ఉన్నాయి. ఇందులో త‌న మిత్రుడు మ‌జ్లిస్ అధినేత స్వ‌యంగా పోటీ చేసే హైద‌రాబాద్ లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గాన్ని వ‌దిలిపెట్టాల‌న్న ఆలోచ‌న‌లో కేసీఆర్ ఉన్న‌ట్లు చెబుతున్నారు. పోటీ చేసినా అది స్నేహ‌పూర్వ‌కంగా ఉండాలే కానీ.. పోటాపోటీగా ఉండ‌కూద‌న్న కృత‌నిశ్చ‌యంతో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇక‌.. 16 నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేసేందుకు అభ్య‌ర్థుల్ని సిద్ధం చేసిన‌ట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన క‌స‌ర‌త్తు ఇప్ప‌టికే పూర్తి చేసిన‌ట్లుగా స‌మాచారం.

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మాదిరే  లోక్ స‌భ ఎన్నిక‌ల్లోనూ ఒక‌రిద్ద‌రు మిన‌హా మిగిలిన వారంతా సిట్టింగుల‌కే సీట్ల‌ను కేటాయించే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. ఈ మ‌ధ్య‌న పార్టీ మారిన కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను లోక్ స‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌న‌ని ఇప్ప‌టికే స్ప‌ష్టం చేసిన కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి( టీఆర్ఎస్‌లో ఆయ‌న చేరారు) ల‌కు బ‌దులుగా కొత్త ముఖాలు తెర మీద‌కు వ‌స్తాయ‌ని చెబుతున్నారు. అదే స‌మ‌యంలో మ‌ల్కాజిగిరి ఎంపీగా వ్య‌వ‌హ‌రిస్తున్న మ‌ల్లారెడ్డి తాజా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన నేప‌థ్యంలో ఆయ‌న స్థానంలో మ‌రొక‌రిని ఎన్నిక‌ల బ‌రిలోకి దింపేందుకు క‌స‌ర‌త్తుపూర్తి అయిన‌ట్లుగా తెలుస్తోంది. ఎన్నిక‌ల గంట మోగ‌క ముందే అభ్య‌ర్థుల‌ను రెఢీ చేసుకుంటున్న కేసీఆర్ తీరు చూస్తే.. ప్లానింగ్ విష‌యంలో ఆయ‌న ఎంత స్ప‌ష్టంగా ఉన్నార‌న్న విష‌యం ఇట్టే తెలుస్తోంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.


Tags:    

Similar News