ఆయన్ను యాదాద్రికి వెంటబెట్టుకొని తీసుకెళతానన్న కేసీఆర్

Update: 2021-06-13 06:30 GMT
తెలుగు వాడు.. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న జస్టిస్ ఎల్వీ రమణను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారి మధ్య పలు అంశాలు చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. మాటల మధ్యలో తాను ప్రత్యేక శ్రద్ధతో రూపొందిస్తున్న యాదాద్రి దేవాలయానికి సంబంధించిన వివరాల్ని చెప్పిన కేసీఆర్.. ఆలయ సందర్శనకు రావాలని కోరారు.

తాను వెంట పెట్టుకొని తీసుకెళతానని జస్టిస్ రమణతో చెప్పినట్లుగా తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో తగిన ఏర్పాట్లు చేసి యాదాద్రికి తీసుకెళతానని చెప్పినట్లుగా సమాచారం. యాదాద్రి గురించి జస్టిస్ రమణకు తెలిసినప్పటికీ.. గడిచిన కొన్నేళ్లలో ఆ పుణ్యక్షేత్రానని ఎంతలా మార్చారో తెలిసిందే. స్వతహాగా అధ్యాత్మిక వేత్త.. తిరుమలకు తరచూ వచ్చి వెళ్లే జస్టిస్ రమణను.. యాదాద్రికి రావాలని కోరారు. అందుకు ఆయన అంగీకరించారు. అదే సమయంలో తమ వెంట గవర్నర్ తమిళ సైను కూడా రావాలని కోరారు. అందుకు ఆమె అంగీకరించారు.

దీంతో యాదాద్రికి రానున్న అపూర్వ అతిధుల కోసం భారీ ఏర్పాట్లు మొదలయ్యాయి. ఇందుకోసం మంత్రి జగదీశ్ రెడ్డితో పాటు.. సీఎంవో కార్యదర్శి భూపాల్ రెడ్డి యాదాద్రి వెళ్లి.. అక్కడ ఏర్పాట్లనను పరిశీలించి మార్పులు చేర్పులు చేస్తున్నారు. కొండపై కొత్తగా నిర్మించిన గెస్టు హౌస్ లో ప్రధాన న్యాయమూర్తి బస కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మరికొందరు కీలక అధికారులు కూడా వెళుతున్నారు. ఏమైనా.. ఒక ఆధ్యాత్మిక కేంద్రానికి ఈ తరహా కాంబినేషన్ లో వెళ్లటం ఒక ఎత్తు అయితే.. ఈ టూర్ కు సీఎం కేసీఆర్ వెంట పెట్టుకొని వెళ్లటం మరో అరుదైన అంశంగా చెప్పక తప్పదు. ఈ కాంబినేషన్ లో మరోసారి యాదాద్రి టూర్ ఉండదనే చెప్పాలి.
Tags:    

Similar News