అమ‌రావ‌తిలో ఉద్రిక్త‌త‌..న‌ల్ల‌రంగులు పోసి రైతుల నిర‌స‌న‌

Update: 2019-12-21 08:32 GMT
`ఏపీలో మూడు రాజ‌ధానుల ఏర్పాటు` అంశంలో ప్ర‌కంప‌న‌లు కొన‌సాగుతున్నాయి. ఇప్ప‌టికే ఈ నిర్ణ‌యం విష‌యంలో ఆయా పార్టీల నేత‌లు త‌మ వైఖ‌రులు వ్య‌క్తం చేస్తున్నారు. కొంద‌రు మ‌ద్ద‌తిస్తుండ‌గా...ఇంకొంద‌రు వ్య‌తిరేకిస్తున్నారు. మ‌రికొంద‌రు ఎటూ తేల్చ‌డంలేదు. తాజాగాఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన వికేంద్రీకరణ కోసం మాజీ కేంద్ర మంత్రి - ప్రముఖ సినీనటుడు చిరంజీవి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అధికార - పరిపాలన వికేంద్రీకరణతో అభివృద్ధి సాధ్యమేనని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, ఇదే స‌మ‌యంలో అమ‌రావ‌తిలో ఉద్రిక్త‌త నెల‌కొంది. ఏకంగా వైసీపీ కార్య‌క‌ర్త‌లే గ్రామ‌పంచాయ‌తీకి న‌ల్ల‌రంగు వేసి నిర‌స‌న తెలిపారు.

మ‌రోవైపు  పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ర్టాన్ని నాలుగు ప్రాంతాలుగా విభజించి అభివృద్ధి చేయాలని రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ తుది నివేదిక అనంత‌రం  సమర్పించిన విషయం తెలిసిందే. మూడు రాజధానుల అంశంపై అమరావతి ప్రాంతంలో ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా రాయపూడి పంచాయతీ కార్యాలయానికి స్థానికులు నల్ల రంగు వేశారు. రాయపూడిలో ఉన్న గ్రామ సచివాలయానికి రంగులు మార్చింది వైసీపీ రైతులేన‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. వైసీపీ రైతులే కడుపు మండి రంగులు మారుస్తున్నాం అంటున్నారని ప‌లు మీడియాల్లో ప్ర‌చారం జ‌రిగింది.

త‌మ‌కు అన్యాయం చేసిన ఈ ప్రభుత్వ రంగులు ఇక్కడ ఉండటానికి వీలులేదని ఆ రైతులు ఆవేదన వ్య‌క్తం చేసిన‌ట్లు స‌మాచారం. రాయపూడిలో ఉధ్రిక్త‌ వాతావరణం నేప‌థ్యంలో..రంగులు వేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించిన‌ట్లు తెలిసింది. అయితే, ఈ చ‌ర్య‌ను వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నట్లు స‌మాచారం. దీంతో, పోలీసులు అరెస్ట్ చెయ్యలేకపోయినట్లు తెలుస్తోంది. కాగా, ``మా అనుమతి లేకుండా రంగులు వేశారు....రాజధాని ఇక్కడ లేనప్పుడు ఈ రంగులు మాకెందుకు?``... అంటూ గ్రామస్తులు వ్యాఖ్యానించిన‌ట్లు తెలుస్తోంది.


Tags:    

Similar News