కెప్టెన్ ఎలా సమర్ధించుకుంటారు ?

Update: 2021-09-30 05:33 GMT
సరిగ్గా ఎన్నికలకు ముందు పంజాబ్ రాజకీయాలు చాలా ఆసక్తిగా మారుతున్నాయి. రోజుకో డెవలప్మెంట్ తో రాజకీయాలు సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తున్నాయి. మరో ఆరుమాసాల్లో సాధారణ ఎన్నికలను ఎదుర్కోబోతున్న నేపధ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీకి తలనొప్పులు రోజురోజుకు బాగా ఎక్కువైపోతున్నాయి. పార్టీలో వ్యవహారాలు ఎలాగున్నా మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ఢిల్లీ పర్యటన, కేంద్రంలోని పెద్దలతో జరుపుతున్న భేటీలు రాష్ట్ర రాజకీయాల్లో బాగా హీటు పెంచేస్తున్నాయి.

తాజా పరిణామాలను చూస్తుంటే అమరీందర్ తొందరలోనే బీజేపీలో చేరటం ఖాయంగా అర్ధమవుతోంది. తాను బీజేపీలో చేరాలంటే నరేంద్రమోడికి రెండు షరతులను విధించినట్లు ప్రచారం జరుగుతోంది. మొదటిదేమ మూడు నూతన వ్యవసాయ చట్టాలకు సవరణలు చేయటం. రెండోదేమో తనకు సముచితమైన స్ధానం అంటే కేంద్రమంత్రి పదవిలాంటిది ఇవ్వటం. కెప్టెన్ పెట్టిన రెండు షరతులకు మోడి అంగీకరిస్తే బీజేపీలో అమరీందర్ చేరటం లాంఛనమే అనిపిస్తోంది.

ఇక్కడ గమనించాల్సిందేమంటే మూడు వ్యవసాయ చట్టాలకు సవరణలు అనేది జరిగేపనికాదు. ఎందుకంటే సవరణల కోసం స్వయంగా సుప్రింకోర్టు జోక్యం చేసుకుని సూచనలు చేసినా అందుకు మోడి అంగీకరించలేదు. వ్యవసాయచట్టాలకు వ్యతిరేకంగా పదినెలలుగా ఉద్యమం చేస్తున్న భారతీయ కిసాన్ సంఘ్ ఎన్ని సవరణలు సూచించినా మోడీ పట్టించుకోలేదు. అంటే వ్యవసాయ చట్టాలకు సవరణలు చేయటాన్ని మోడి ప్రిస్టేజియస్ ఇష్యుగా తీసుకన్నారు. అందుకనే ఎంతమంది చెబుతున్న సవరణలకు అంగీకరించటంలేదు.

వ్యవసాయచట్టాలకు సవరణల విషయంలో ఇంత పట్టుదలగా ఉన్న మోడి  ఇపుడు అమరీందర్ చెప్పగానే సవరణలకు అంగీకరిస్తారా ? అనేది డౌటే. కెప్టెన్ కోణంలో చూస్తే సీఎంగా ఉన్నంత కాలం వ్యవసాయచట్టాలను నూరుశాతం వ్యతిరేకించారు. రాష్ట్రంలోని రైతులను కేంద్రానికి వ్యతిరేకంగా ఉసిగొల్పారు. వ్యవసాయచట్టాలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో జరిగిన అనేక సమావేశాల్లో ప్రసంగించారు. ఢిల్లీ శివార్లలో రైతులు చేస్తున్న నిరవధిక ఉద్యమానికి పంజాబ్ నుండి వెళ్ళిన వేలాదిమంది రైతులకు అవసరమైన సౌకర్యాలు ఏర్పాటుచేశారు.

సీఎంగా ఉన్నంత కాలం కేంద్రానికి వ్యతిరేకంగా వ్యవహరించిన కెప్టెన్ ఇపుడు అదే బీజేపీలో చేరటాన్ని ఎలా సమర్ధించుకుంటారో చూడాలి. ఇన్ని సంవత్సరాలు వ్యతిరేకించిన నరేంద్రమోడి, కేంద్రానికి మద్దతుగా మాట్లాడాల్సుంటుంది. రేపటి ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా ప్రచారం చేయాల్సుంటుంది. మరపుడు జనాలు కెప్టెన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారు ? అన్నది ఆసక్తిగా మారింది. ప్రచారంలో ఇదే విషయమై రైతుసంఘాలు నిలదీస్తే అప్పుడు కెప్టెన్ ఏమని సమాధానం చెబుతారు ? మొత్తంమీద పంజాబ్ రాజకీయాలు రోజుకో తీరుగా మారిపోతు ఆసక్తిగా మారుతున్నాయనే చెప్పాలి.
Tags:    

Similar News