ఆచితూచి మాట్లాడినా బొత్సకు భారీ పంచ్ తప్పలేదు!

Update: 2022-04-29 12:04 GMT
ఫైటింగ్ అంటే ఫైటింగ్ అన్నట్లు ఉండాలి. ఒకవేళ వ్యూహాత్మకం ఒకరు చెలరేగిపోతుంటే.. మరొకరు ఆత్మరక్షణతో పోరాటానికి దిగితే ఎలా ఉంటుంది? ఫైట్ మొత్తం ఏకపక్షంగా ఉంటుంది. తాజాగా తెలంగాణ అధికారపక్షానికి ఏపీ అధికారపక్షానికి మధ్యనున్న మాటల వార్ చూస్తుంటే ఇప్పుడు అలాంటి పరిస్థితే నెలకొందన్న భావన వ్యక్తం కావటం ఖాయం.

ఏపీలో దారుణ పరిస్థితులు ఉన్నాయని.. కరెంటు కోత.. నీళ్లు లేకపోవటం.. రోడ్లు ధ్వంసమైపోయి ఉన్నాయని తన స్నేహితుడు తనకు చెప్పిన మాటల్ని మంత్రి కేటీఆర్ క్రెడాయ్ సభలో చెప్పటం.. దానిపై ఏపీ అధికారపక్ష నేతలు రియాక్టు కావటం తెలిసిందే.

మంత్రి కేటీఆర్ మాటలకు ఎలాంటి కసరత్తు చేయకుండా.. ఆచితూచి అన్నట్లుగా తన సహజశైలికి భిన్నంగా మాట్లాడిన ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణకు భారీ పంచ్ పడింది. తాను హైదరాబాద్ లో నిన్నటి వరకు (గురువారం) ఉన్నానని.. కరెంట్ లేకపోవటంతో రెండు రోజులు తన ఇంటికి జనరేటర్ ఆడించినట్లుగా చెప్పారు. తనకు ఎదురైన అనుభవం గురించి తాను ఎక్కడా చెప్పటం లేదని.. అలాంటప్పుడు మంత్రి కేటీఆర్ ఏపీ గురించి ఎలా మాట్లాడతారంటూ బొత్స చేసిన వ్యాఖ్యలకు బలమైన పంచ్ పడింది.

బొత్స వ్యాఖ్యలకు టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి రియాక్టు అయ్యారు. ‘బొత్స సత్యానారాయణ కరెంటు బిల్లు కట్టలేదు కావొచ్చు. అందుకే పవర్ సప్లై కట్ చేసి ఉంటారు’ అంటూ చేసిన వ్యాఖ్య బొత్స పరువు పోయేలా ఉందంటున్నారు. మరోవైపు.. బొత్స తప్పుగా మాట్లాడారన్న మాట వినిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీలో ఉన్న ప్రతి కుటుంబానికి హైదరాబాద్ లో ఏదో ఒక లింకు ఉందని.. అదే సమయంలో తెలంగాణలోని వారికి ఏపీతో లింకులు చాలా చాలా తక్కువన్న విషయాన్ని ఆయన మిస్ అయ్యారు.

ఎందుకంటే.. బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. హైదరాబాద్ లో రెండు రోజులు కరెంటు లేక జనరేటర్ తో ఆడించిన విషయాన్ని చెప్పినంతనే ఏపీకి చెందిన చాలామంది హైదరాబాద్ కు ఫోన్ చేసి కరెంటు కోత ఉందా? అంటే లేదనే సమాధానం చెప్పటం ఖాయం.

అప్పుడు బొత్స మాటల్లో నిజం లేదన్న భావనకు గురి కావటమే కాదు.. ఏపీ ప్రభుత్వం మీద మరింత వ్యతిరేకత వ్యక్తం కావటం ఖాయం. అందుకే అంటారు.. సర్వం సన్నద్ధమై యుద్ధానికి వచ్చినప్పుడు ఆవేశంతో కంటే ఆలోచనతో యుద్ధం చేయాలన్న విషయాన్ని ఏపీ వైసీపీ నేతలు అర్థం చేసుకుంటే మంచిది. లేదంటే.. బొత్సకు ఎదురైన ఘాటు పంచ్ లు ఎదురుకావటం ఖాయం.
Tags:    

Similar News