ఉప్పల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై కేసు.. అసలేమైంది?

Update: 2021-05-25 03:31 GMT
ప్రైవేటు భూమినో.. ప్రభుత్వ భూమినో కబ్జా చేశారన్న ఆరోపణలతో రాజకీయ నేతలు.. ప్రజాప్రతినిధులపై కేసులు నమోదుకావటం మామూలే. అయితే.. ఉప్పల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే భేతి సుభాషణ్ రెడ్డిపై తాజాగా నమోదైన కేసు ఇందుకు భిన్నమన్న మాట వినిపిస్తోంది. భూవివాదం ఇష్యూలో ఆయనపై కేసు నమోదు చేసినట్లుగా వార్తలు వచ్చాయి. దీనిపై ఆయన మాట వింటే అవాక్కు అవ్వాల్సిందే.

ఆయనపై నమోదైన కేసుకు సంబంధించి ఆయనేమన్నారంటే.. ‘‘ప్రభుత్వ భూమిని కాపాడాలని మేం చెప్పాం. అందులో తప్పేముంది? ప్రభుత్వ భూమిని కాపాడాలని అధికారులు ఆ స్థలం వద్దకు వెళితే.. వారిపై కొందరు దాడి చేసే అవకాశం ఉందని తెలపటంతో రక్షణ కల్పించాలని డీసీపీకి చెప్పాం. అంతకు మించి తప్పు చేయలేదు. నేనేమీ భూమికి ఆక్రమించుకోలేదు. ప్రభుత్వ భూమిని రక్షించాలని రెవెన్యూ అధికారుల ప్రయత్నానికి అండగా నిలిచాం. అదే నేను చేసిన తప్పా?’’ అని ఆయన ప్రశ్నిస్తున్నారు.

అసలీ వివాదానికి సంబంధించి కాప్రా తహసీల్దార్ గౌతమ్ వెర్షన్ చూస్తే.. సర్వే నెంబరు 152, 153లో 23 ఎకరాల భూమి ఉంది.అదంతా ప్రభుత్వ ఆధీనంలో ఉంది. ఆ భూమిని ప్రైవేటు వ్యక్తులు ఆక్రమిస్తుంటే.. అడ్డుకొన్నాం. వారు వేసిన కంచెల్ని తొలగించాం. ఇంతలో లాయర్ మేకల శ్రీనివాస్ యాదవ్.. శరత్ అనే వ్యక్తి తమ అనుచరులతో కలిసి రెవెన్యూ సిబ్బందిని తీవ్రంగా దూషించారు. వారి విధుల్ని అడ్డుకున్నారు. బెదిరింపులకు పాల్పడ్డారు. వారిపై మార్చి 18న జవహర్ నగర్ పోలీసులకుకంప్లైంట్ చేయటంతో కేసు నమోదైంది. దీనికి ప్రతిగా ఎమ్మెల్యేతో పాటు తనపైనా బెదిరింపులకు పాల్పడ్డామని హైకోర్టును ఆశ్రయించారు. ఇందులో భాగంగా పోలీసులు కేసు నమోదు చేశారు’ అని తహసీల్దార్ చెబుతున్నారు. ప్రభుత్వ భూమిని కాపాడే ప్రయత్నంలో ఎమ్మెల్యే.. తహసీల్దార్ మీద కేసు నమోదు కావటం..ఇష్యూ కోర్టులో ఉండటం ఇప్పుడీ అంశం చర్చనీయాంశంగా మారింది.
Tags:    

Similar News