చింత‌మ‌నేనిపై పైపుల చోరీ కేసు!

Update: 2019-06-20 05:07 GMT
వివాదాస్ప‌దంగా వ్య‌వ‌హ‌రించ‌టం అల‌వాటైన దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ తాజాగా మ‌రోసారి వార్త‌ల్లోకి వ‌చ్చారు. విన్నంత‌నే కిసుక్కున న‌వ్వే అంశంలో ఆయ‌న పాత్ర ఉండ‌టం చూస్తే.. మ‌రీ ఇంత క‌క్కుర్తి ఏంటి చింత‌మ‌నేని? అన్న మాట నోటి వెంట రావ‌టం ఖాయం.

పైపుల్ని దొంగ‌త‌నం చేసిన కేసులో చింత‌మ‌నేనిని.. ఆయ‌న అనుచ‌రుల మీద కేసులు న‌మోదు చేశారు. ఎందుకిలా అంటే.. పోల‌వ‌రం కాలువ‌పై నీటిని తోడ‌టానికి ఏర్పాటు చేసిన పైపుల్ని వారు చోరీ చేసిన‌ట్లుగా పోలీసుల‌కు ఫిర్యాదు అందించింది. ప‌ట్టిసీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కం ద్వారా పోల‌వ‌రం కుడికాలువ నుంచి కృష్ణాన‌దిలోకి వెళుతున్న గోదావ‌రి నీటిని దెందులూరు నియోజ‌క‌వ‌ర్గంలోని పంట పొలాల‌కు స‌ర‌ఫ‌రా చేయ‌టానికి అనువుగా మూడేళ్ల క్రితం చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ అధ్వ‌ర్యంలో పైపులు ఏర్పాటు చేసి నీటిని చెరువుల‌కు మ‌ళ్లించారు.

ఈ పైపుల ద్వారా దెందులూరు.. పెద‌వేగి.. పెద‌పాడు.. ఏలూరు రూర‌ల్ మండ‌ల్లాల్లోని గ్రామాల్లో సాగుకు ఈ పైపుల ద్వారానే నీరు అందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. నీటిని పెట్టుకునేందుకు వాడిన పైపులకు అద్దె కింత ప్ర‌తి ఏడాది వెయ్యి చొప్పున రైతుల నుంచి చింత‌మ‌నేని వసూలు చేస్తున్నారు. సోమ‌వారం అర్థ‌రాత్రి చింత‌మ‌నేని అనుచ‌రులు వ‌చ్చి..చింత‌మ‌నేని తీసుకుర‌మ్మ‌న్నారంటూ పైపుల్ని తీసేశారు.

దీంతో తీవ్ర ఆగ్ర‌హానికి గురైన రైతులు ఆందోళ‌న నిర్వ‌హించారు. పైపుల్ని మాజీ ఎమ్మెల్యే.. ఆయ‌న అనుచ‌రులు చోరీ చేశారంటూ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఏటా ఎక‌రానికి వెయ్యి రూపాయిలు ఇవ్వ‌టం ద్వారా పైపుల మీద వారు పెట్టిన ఖ‌ర్చుకు మించిన డ‌బ్బులు స‌మకూరాయ‌ని.. అయినా వేధింపుల‌కు గురి చేయ‌టాన్ని వారు త‌ప్ప ప‌డుతున్నారు.  దీంతో చింత‌మ‌నేనితో స‌హ  మ‌రో ఐదుగురిపైన వివిధ సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు చేశారు.

అయినా.. ప‌వ‌ర్లో లేన‌ప్ప‌డు ప్ర‌జ‌ల‌కు మ‌రింత సాయం చేయ‌టం.. అండ‌గా ఉండ‌టం ద్వారా వారి మ‌న‌సుల్ని దోచుకునే అవ‌కాశం ల‌భిస్తుంది. అందుకు భిన్నంగా క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌టం డ్యామేజింగ్ గా మారుతుంది.  ఈ విష‌యాన్ని చింత‌మ‌నేని ఎందుకు గుర్తించ‌టం లేద‌న్న‌ది ప్ర‌శ్న‌. ఇలాంటి పొర‌పాట్లు చేస్తే ప్ర‌జ‌లు క్ష‌మించ‌ర‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు.
Tags:    

Similar News