టీడీపీని ‘చట్టం’తోనే కొడుతున్న వైసీపీ

Update: 2020-05-26 10:35 GMT
చట్టం ఒకరికి చుట్టంగా మరొకరి పక్కలో బల్లెంలా ఎందుకుంటుంది. ఆ చట్టాన్ని ఉపయోగించుకొని లూప్ హోల్స్ తో ఇరుకునపెట్టగలవారే రాణిస్తారు వారి తెలివితేటలు పార్టీలకు అవసరం. ఇప్పుడు ఏ అస్త్రాన్ని అయితే వైసీపీపై ప్రయోగించి టీడీపీ చోద్యం చూస్తుందో అదే అస్త్రంతో ప్రతిపక్ష టీడీపీని కొట్టడానికి వైసీపీ రెడీ అయ్యింది.

టీడీపీ చేతిలో ఆయుధమైన ‘చట్టం’తోనే పచ్చపార్టీ పనిపట్టాలని వైసీపీ రెడీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

తాజాగా రెండు నెలల లాక్ డౌన్ అనంతరం చంద్రబాబు పక్కరాష్ట్రం నుంచి తన సొంత రాష్ట్రానికి వచ్చారు.. మంది మార్బలంతో ఎంట్రీలోనే అదరగొట్టారు. దండయాత్రలా ఈ పర్యటన సాగింది. లాక్ డౌన్ నిబంధనలు గాలికి వదిలి.. కరోనా వ్యాపిస్తుందన్న కనీస సృహ లేకుండా మోటార్ సైకిల్ ర్యాలీలు .. నాయకులతో సామాజిక దూరం పాటించకుండా బాబు కలిసిపోవడాలు చేశారు. అయితే ఇన్నాళ్లు దీనిపై వైసీపీ ఫోకస్ చేయలేదు. పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు టీడీపీ బాటలోనే వైసీపీ వచ్చేసింది.

ఇటీవల అధికార వైసీపీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారని టీడీపీ సానుభూతి పరులు, టీడీపీ నేతలు హైకోర్టులో కేసులు వేశారు. దీనిపై హైకోర్టు వెంటనే విచారణ కూడా చేపట్టింది. దీనిపై ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు.? ఈ కేసును సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించకూడదో చెప్పాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.

అందుకే ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలలాగే చేసిన టీడీపీ అధినేత చంద్రబాబుపై తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ వెన్నపూజ గోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే మేరుగ నాగార్జునలు వేర్వేరుగా హైకోర్టుకు లేఖలు రాశారు. హైదరాబాద్ నుంచి రోడ్డుమార్గం ద్వారా అమరావతి వచ్చిన చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ అడుగడుగునా లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించాడని.. అయినా పోలీసులు చర్యలు తీసుకోలేదంటూ హైకోర్టుకు లేఖలో ఫిర్యాదు చేశారు. ఈ లేఖను సుమోటోగా తీసుకొని చంద్రబాబు, ఆయన తనయుడిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని హైకోర్టును వైసీపీ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే అభ్యర్థించారు. దీన్ని ప్రజాప్రయోజన వ్యాజ్యంగా పరిగణించాలని న్యాయస్థానాన్ని కోరారు.

ఇన్నాళ్లు కోర్టులకు వెళుతూ టీడీపీ నేతలు మాత్రమే ఇలా వైసీపీని ఇబ్బందులు పెట్టేవారు. వైసీపీ నేతలు ఇలా చేయలేదు. చంద్రబాబు ప్రభుత్వంలో ప్రభుత్వ కార్యాలయాలు, అన్నాక్యాంటీన్లకు పసుపు రంగులు వేసినా వైసీపీ ఎన్నడూ హైకోర్టుకు ఎక్కలేదు. అదే నేడు టీడీపీ మాత్రం వైసీపీ రంగులపై హైకోర్టుకు ఎక్కింది. రచ్చ చేస్తోంది. ఇన్నాల్లు చట్టాన్ని ఆయుధంగా మలిచి వైసీపీని ఇరుకునపెట్టిన టీడీపీని ఇప్పుడు అదే చట్టంతో కొట్టాలని వైసీపీ రెడీ అయ్యింది. ఈ పరిణామం రాజకీయా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరి బాబు అమరావతి దండయాత్రపై హైకోర్టు ఎలా స్పందిస్తున్నది ఆసక్తి గా మారింది.
Tags:    

Similar News