ఫామ్‌హౌజ్ కేసులో రామ‌చంద్ర‌భార‌తిపై కేసు.. రీజ‌న్ ఇదే!

Update: 2022-11-23 17:30 GMT
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న మొయినాబాద్ ఫామ్‌హౌజ్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఆ కేసులో నిందితుడైన రామచంద్ర భారతిపై బంజారాహిల్స్ పీఎస్‌లో మరో ఫిర్యాదు నమోదైంది. రామచంద్ర భారతిపై సిట్ ఏసీపీ గంగాధర్ ఫిర్యాదు చేశారు.

విచారణ వేళ దొరికిన ఐఫోన్, ల్యాప్‌టాప్‌లో నకిలీ పాస్‌పోర్ట్‌ లభ్యమైందని తెలిపారు. `భారత్ కుమార్ శర్మ` పేరిట ఉన్న పాస్‌పోర్ట్ లభ్యమైందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కర్ణాటక పుత్తూరు చిరునామాతో పాస్‌పోర్ట్ గుర్తించినట్లు వివరించారు. T9633092 పాస్ పోర్ట్ నంబర్‌గా గుర్తించారు.

ఈ  ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రామచంద్రభారతి ల్యాప్‌టాప్‌ను పరిశీలించినప్పుడు అందులో రెండు పాస్‌పోర్టులు ఉన్నట్టు సిట్‌ అధికారులు గుర్తించారు. రెండు వేర్వేరు నెంబర్లతో రామచంద్రభారతి పాస్‌పోర్టులు ఉన్నట్టు తేలింది. దీంతో ఏసీపీ ఫిర్యాదు చేశారు. ఆధార్‌, పాన్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌లు సైతం ఒక్కోటి 3 చొప్పున కలిగి ఉన్నాడని రామచంద్రభారతిపై ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గతంలోనే ఆయనపై ఒక కేసు నమోదైంది.

మ‌ళ్లీ పోలీసు క‌స్ట‌డీకి!

ఫామ్‌హౌజ్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ముగ్గురు నిందితులను కస్టడీకి ఇవ్వాలని సిట్‌ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు శనివారం పిటిషన్‌ దాఖలు చేశారు. ఎంతో కీలకమైన ఈ కేసులో పూర్తి వివరాలు తెలుసుకోవాల్సి ఉందని, ఎవరెవరికి సంబంధాలున్నాయనే విషయాలు సేకరించాల్సి ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు.

ఇప్పటికే నిందితులను రెండురోజులు కస్టడీకి తీసుకొని ప్రశ్నించినప్పటికీ సరైన సమాచారం సేకరించలేకపోయామని, మరో ఐదు రోజులు కస్టడీకి అనుమతించాలని కోరారు. పోలీసుల పిటిషన్‌పై కౌంటరు దాఖలు చేయాలని నిందితుల తరఫు న్యాయవాదులను నాంపల్లి కోర్టు ఆదేశించడంతో మంగళవారం కౌంటరు దాఖలు చేశారు. దీనిపై బుధవారం విచారణ చేపట్టిన ఏసీబీ ప్రత్యేక కోర్టు... గురువారం కస్టడీ పిటీషన్‌పై తుది తీర్పు ప్రకటిస్తామని పేర్కొంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News