నగదు రహితం సాధ్యమేనా?

Update: 2016-11-19 01:30 GMT
పెద్ద నోట్ల రద్దు విషయంలో ప్రభుత్వ చర్యను ప్రజల్లో కొందరు హర్షిస్తున్నప్పటికీ - మరిన్ని ఇబ్బందులు తలెత్తితే పరిస్థితి ఏమిటన్నది మాత్రం ఆందోళన కలిగించే అంశంగా మారింది. ప్లాస్టిక్‌ కరెన్సీ (డెబిట్‌  - క్రెడిట్‌ కార్డులు) వచ్చి ఏళ్ళు గడుస్తున్నా దాని వినియోగిస్తున్న వారు తక్కువే. పైగా దాన్ని వినియోగిస్తున్నందుకు ఏటీఎంలలో ఒక పరిమితి దాటాకా, వివిధ చెల్లింపుల్లో చార్జీలు - సర్‌ ఛార్జీలు చెల్లించాల్సి రావడం ఇబ్బందికరంగా మారింది. మరోవైపున మైక్రోఏటీఎంలు - మొబైల్‌ ఏటీఎంలు కూడా రంగ్రపవేశం చేశాయి. ప్లాస్టిక్‌ కరెన్సీకి పూర్తిగా మారకముందే తదుపరి దశకు చెందిన మొబైల్‌ వాలెట్స్‌ కూడా వచ్చాయి. ప్రస్తుతానికి ఆధునిక యువత మాత్రమే అధికంగా మొబైల్‌ వాలెట్స్‌ ను వినియోగిస్తోంది. పెద్ద నోట్ల రద్దుపై ఇ-కామర్స్‌ వెబ్‌ సైట్స్‌ హర్షం వ్యక్తం చేశాయి. ఆరంభంలో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో ఇది దేశానికి, తమ వ్యాపారాలకూ ఇది మేలు చేస్తుందన్న అభిప్రాయాన్ని అవి వ్యక్తం చేస్తున్నాయి. వీటన్నింటి మధ్య ఒక విధమైన సమతుల్యం ఏర్పడేందుకు మరి కొంత కాలం పట్టవచ్చునని ఆర్థిక నిపుణులు అంటున్నారు. నగదు రహిత సమాజం ఏర్పడడానికి ఇండియా ఇంకా ఎన్నో మెట్లు ఎక్కాల్సి ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

ముఖ్యంగా ఈ వ్యవస్థలో ఉన్న నష్ట భయం - అపోహలు తొలగాల్సి ఉంది. డెబిట్‌ - క్రెడిట్‌ కార్డులకు సంబంధించి గోప్యంగా ఉండాల్సిన సమాచారం హ్యాకర్ల చేతిలో పడడం లాంటి వాటి నేపథ్యంలో ప్రజలు ఆ కార్డులను ఇంకా పూర్తిగా విశ్వసించలేకపోతున్నారు. దీనికి సంబంధించి సెక్యూరిటీ వ్యవస్థను పటిష్ఠం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్‌ బీఐ సమాచారం ప్రకారం - దేశంలో 2.59 కోట్ల క్రెడిట్‌ కార్డులు - 69.72 కోట్ల డెబిట్‌ కార్డులు ఉన్నాయి. మరో వైపున దేశంలో అధిక శాతానికి బ్యాంకింగ్‌ సదుపాయాలు - ఇంటర్నెట్‌ అందుబాటులో లేవు. దేశం మొత్తం మీద ఆన్‌ సైట్‌ - ఆఫ్‌ సైట్‌ కలిపి 2 లక్షల ఏటీఎంలు మాత్రమే ఉన్నాయి. బ్యాంకుల బ్రాంచీల సంఖ్య 1.34 లక్షలు మాత్రమే. డెబిట్‌ కార్డులను చాలా మంది ఏటీఎంల నుంచి డబ్బు డ్రా చేసుకునేందుకు మాత్రమే వినియోగిస్తున్నారు. ఆన్‌ లైన్‌ చెల్లింపులకూ దీన్ని వినియోగించుకునే అవకాశం ఉన్నప్పటికీ క్యాష్‌ ఆన్‌ డెలివరీకే ప్రాధాన్యం ఇస్తున్నారు. అదనపు చార్జీలతో పాటుగా సమాచార తస్కరణ జరుగుతుందనే భయంతో చెల్లింపులకు వీటిని తక్కువగానే ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో నగదు రహిత ఆర్థిక వ్యవస్థ లక్ష్యసాధన కాస్తంత దూరంగానే ఉందనే చెప్పవచ్చు.

ప్లాస్టిక్‌ కరెన్సీని వినియోగించాలని ప్రజలను ప్రభుత్వం కోరుతున్నప్పటికీ - దేశంలోని వాణిజ్య వ్యవస్థలో అతి తక్కువ భాగం మాత్రమే వీటిని ప్రజలకు అందుబాటులో ఉంచింది. దేశంలో 95 శాతం లావాదేవీలు నగదు రూపంలోనే జరుగుతున్నాయి. కార్డ్‌ స్వైపింగ్‌ మెషిన్లు (పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ టర్మినల్స్‌) అతి తక్కువగా ఉన్న దేశాల్లో భారతదేశం ఒకటి. చిన్న నోట్లు సిద్ధం చేయకుండా పెద్ద నోట్లు రద్దు చేసిన ప్రభుత్వం నగదు రహిత దేశాన్ని నిర్మించాలంటే ఇంకా చురుగ్గా ఉండాల్సిన అవసరం ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News