థూ.. ఆంధ్రోళ్లకు మాత్రమే ఇలాంటివి సాధ్యమా?

Update: 2019-11-01 02:56 GMT
ఒక ప్రాంతానికి చెందిన వారు.. తామంతా ఒక కుటుంబంగా ఫీల్ కాకపోవటం ఎక్కడా ఉండదు. అదేం దరిద్రమో కానీ.. ఆంధ్రప్రదేశ్ లో ఈ రోగం కాస్త ఎక్కువన్న మాట వినిపిస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. ప్రాంతాల వారీగా ప్రేమించే క్రమంలో.. అది కూడా సరిగా చేయకపోగా.. కులాల వారీగా చీలిపోయే చిత్రమైన బుద్ధి ఆంధ్రోళ్లకు ఎక్కువని చెబుతారు. ఈ కారణంతోనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమకు సంబంధించిన హక్కుల విషయంలో ఎప్పుడూ సంఘటితంగా వ్యవహరించలేదన్న విమర్శ వినిపిస్తూ ఉంటుంది.

మరో దారుణమైన విషయం ఏమంటే.. ఆంధ్రప్రదేశ్ లో ఎవరినైనా సరే.. సాటి ఆంధ్రోడి కంటే కూడా వారి కులాన్ని చూసే ధోరణి ఎక్కువగా కనిపిస్తుంది. మద్రాసీగా పిలిపించుకుంటూ.. తమకంటూ ఒక ఐడెంటిటీ లేక.. ఘోర అవమానాలకు గురయ్యే వేళ.. ఆ విషయాన్ని ఎలుగెత్తి.. ఆంధ్రోళ్లకు ఒక గుర్తింపు లభించేలా చేయటమే కాదు.. వారిదో జాతి అన్న విషయాన్ని ప్రపంచానికి తెలిసేలా చేయటమే కాదు.. వారు పట్టుపడితే దేనికైనా రెఢీ అన్న ఇమేజ్ వచ్చేందుకు కీలకమైన అమరజీవి పొట్టి శ్రీరాముల్ని ఆంధ్రోళ్ల పితామహుడిగా కంటే కూడా ఆర్యవైశ్య వర్గానికి చెందిన వ్యక్తిగా చూడటానికి మించిన దరిద్రం ఇంకేం ఉంటుంది.

తెలంగాణ జాతి అన్న భావనను పెంచటమే కాదు.. దానికో సిద్ధాంతకర్తగా ఫ్రొపెసర్ జయశంకర్ ను కలాలకు.. మతాలకు అతీతంగా జయశంకర్ సార్ అని ప్రేమగా పిలుచుకుంటారు తెలంగాణవాసులంతా. కొత్తపల్లి జయశంకర్ కులం ఏమిటన్న ప్రశ్నను వేస్తే.. చటుక్కున సమాధానం చెప్పే తెలంగాణ వారు చాలా తక్కువగా కనిపిస్తారు. అదే సమయంలో ఏపీ కోసం పోరాటం చేసి.. తన ప్రాణాల్ని పణంగా పెట్టిన పొట్టి శ్రీరాముల పేరు చెప్పి.. ఆయనది ఏ కులమని అడిగినంతనే వైశ్యుడిగా చెప్పటం కనిపిస్తుంది.

తమ జాతిపిత విషయంలో ఆంధ్రోళ్లకు.. తెలంగాణ వారికి మధ్యనున్న వ్యత్యాసం దీనిగా చెప్పాలి. కొత్తపల్లి జయశంకర్ మాష్టార్ని విశ్వబ్రాహ్మణ కులానికి చెందిన వ్యక్తిగా గుర్తిస్తే ఎంత ఛండాలంగా ఉంటుందో.. ఆంధ్రప్రదేశ్ ఆవతరణ కోసం పోరాడిన పొట్టి శ్రీరాముల్ని వైశ్యుడన్న మాటను అదే పనిగా ప్రస్తావిస్తే అంతే ఛండాలంగా ఉంటుంది. రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన వ్యక్తిని ఒక కులానికి చెందిన వ్యక్తిగా చూసే దరిద్రం ఆంధ్రోళ్లకు మాత్రమే సాధ్యమేమో?
Tags:    

Similar News