అభ్య‌ర్థుల ఛాతీపై కులం పేరు...వైర‌ల్!

Update: 2018-04-30 17:22 GMT
భార‌త్ లో బీజేపీ పాల‌నలో ద‌ళితులు, మైనారిటీల‌పై వివ‌క్ష పెరిగిపోతోంద‌ని, దాడులు జ‌రుగుతున్నాయ‌ని బీజేపీ స‌ర్కార్ తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటోన్న సంగ‌తి తెలిసిందే. బీజేపీ హ‌యాంలో దేశంలో మ‌త అస‌హ‌నం పెరిగింద‌ని, ప‌లువురు సామాజిక వేత్తలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో వారి ఆరోప‌ణ‌కు ఊత‌మిచ్చే ఘ‌ట‌న మ‌ధ్య ప్ర‌దేశ్ లో జ‌రిగింది. ఆ రాష్ట్రంలో పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ఛాతీపై ఎస్సీ - ఎస్టీ అని పేర్లు రాయ‌డం తీవ్ర క‌ల‌కం రేపింది. శ‌నివారం నాడు జ‌రిగిన ఈ ఘటన తాలూకు ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో ప్ర‌జ‌లు - ప్ర‌తిప‌క్షాలు మండిప‌డుతున్నాయి. దీంతో దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్టిన స‌ర్కార్....ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు స‌మ‌ర్పించాల‌ని విచారణకు ఆదేశించింది.

మ‌ధ్య ప్ర‌దేశ్ లోని ధ‌ర్ జిల్లాలో కానిస్టేబుల్ పోస్టుల‌కు ఎంపికైన 200మంది అభ్య‌ర్థుల‌కు పోలీసు అధికారులు వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా అభ్య‌ర్థుల ఛాతీల‌పై ఎస్సీ - ఎస్టీ - ఓబీసీ - జ‌న‌రల్ అని రాశారు. ఆ ఘ‌ట‌న తాలూకు ఫొటోలో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో స‌ర్కార్ విచార‌ణ‌కు ఆదేశించింది. దీంతో, బీజేపీపై ప్ర‌తిప‌క్షాలు మండిప‌డుతున్నాయి. ఇది బీజేపీ ప్రభుత్వ జాత్యహంకార వైఖరికి నిదర్శనమని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ట్విటర్‌ లో మండిప‌డ్డారు. ఇది రాజ్యాంగంపై జ‌రిగిన దాడి అని రాహుల్ అన్నారు. ఆర్‌ ఎస్‌ ఎస్ భావ‌జాలం నుంచే ఇటువంటి ఆలోచన వ‌చ్చింద‌న్నారు. మ‌ధ్య ప్ర‌దేశ్ లో ద‌ళితులు - మైనారిటీల‌పై వివ‌క్ష‌కు ఇది నిద‌ర్శ‌న‌మ‌ని మాయావ‌తి, అథ‌వాలే మండిప‌డ్డారు. మ‌రోవైపు, డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో ఈ ఘటనపై విచారణకు ఆదేశించామ‌ని ధార్‌ ఎస్పీ వీరేంద్ర సింగ్‌ తెలిపారు. వేర్వేరు కేటగిరీల అభ్యర్థులకు శారీరక ప్రమాణాలు వేర్వేరుగా ఉన్నందున అభ్యర్థుల ఛాతీపై కులం పేరు రాసినట్లు అక్క‌డి వైద్య సిబ్బంది - పోలీసులు చెప్పారని ఆయ‌న అన్నారు. అయితే, ఈ ఘ‌ట‌న‌ను తీవ్రంగా ప‌రిగ‌ణించి విచార‌ణ జ‌రుపుతున్నామ‌ని అన్నారు. అయితే, ఆ ర‌కంగా రాసినందుకు ఏ అభ్య‌ర్థి ఇప్ప‌టివ‌ర‌కు అభ్యంత‌రం తెలుపుతూ ఫిర్యాదు చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News